ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలు ఒకటొకటిగా మొదలయ్యాయి. తొమ్మిదో తేదీన అమరావతిలో ఎక్కడైతే రాజధాని నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారో అదే స్థలంలో అత్యంత భారీ స్థాయిలో పదవీ స్వీకార ప్రమాణం ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.
ఆ తర్వాత కుదిరితే జూన్ 11వ తేదీన లేదా, మరికొన్ని రోజుల వ్యవధిలో అసెంబ్లీని సమావేశపరచి ఎమ్మెల్యేలు అందరితోనూ ప్రమాణం చేయించే కార్యక్రమం నిర్వహిస్తారు. అసెంబ్లీ తొలి సమావేశానికి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించడానికి ప్రొటెం స్పీకరుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియమించే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశంలో ఎంతో సీనియర్ నాయకుడు. పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావుకు కూడా మంత్రివర్గ సహచరుడు. ఆయన ఇప్పటికి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతటి సీనియారిటీ ఉన్న నాయకుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం బాగుంటుందని పార్టీ అనుకుంటున్నట్టు సమాచారం. నిజానికి స్పీకర్ స్థానానికి కూడా ఆయన పేరునే పరిశీలించాలని అభిప్రాయం కూడా కొందరిలో ఉంది.
అయితే స్పీకర్ స్థానం మీద ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామకృష్ణరాజుకు ఆశ ఉంది. తనను అసెంబ్లీ స్పీకరుగా చూడాలని తన సన్నిహితులు చాలామంది కోరుకుంటున్నారంటూ ఆయన గతంలో బహిరంగంగానే వెల్లడించారు. స్పీకర్ కాకపోతే ఆయన నుంచి మంత్రి పదవి కోసం పోటీ ఎదురవుతుంది. చిట్టచివరి నిమిషంలో ఎన్నికల ప్రచార పర్వం కూడా మొదలైపోయి టికెట్ల కేటాయింపు అంతా జరిగిపోయిన తర్వాత హెలికాప్టర్ లో వచ్చి దిగిన నాయకుడి లాగా పార్టీ సభ్యత్వం తీసుకున్న రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే టికెట్ను గద్దలా తన్నుకు పోవడమే కొంతమందికి రుచించలేదు. అలాంటిది మంత్రి పదవి కూడా ఆయన ఆశిస్తే పార్టీలో గందరగోళం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడమే పార్టీకి సేఫ్ అని చాలామంది భావిస్తున్నారు.
రఘురామను స్పీకరుగా కూర్చోబెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి పుండు మీద కారం రాసిన చందంగా ఉంటుందనే వాదన కూడా పార్టీలో ఉంది. మరొకవైపు ప్రొటెం స్పీకరుగా పార్టీ ఆలోచిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తనకు మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నారు. 2014లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు రకరకాల సమీకరణాల రీత్యా ఆయనకు పదవి దక్కలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి కావాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నట్టు సమాచారం.