ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారం సాగిస్తున్న తీరు.. హఠాత్తుగా వేరే గేర్ లోకి మారిపోయింది. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్రలు నిర్వహిస్తున్న ప్రచార సభలకు ముందు- ఆ ప్రచార సభల తర్వాత పూర్తి వైవిధ్యంగా ఆయన ప్రసంగాలు కనిపిస్తున్నాయి. మొన్నటి దాకా జగన్ మాటలు మొత్తం కేవలం ఆరోపణల పర్వంగా మాత్రమే కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఆయన ఆత్మరక్షణలో పడుతున్నారు. పెద్దగా అరుస్తున్నారు గానీ.. ఆ అరుపుల వెనుక బేలమాటలు కూడా దొర్లుతున్నాయి.
ఇడుపులపాయలో తండ్రికి నివాళులు అర్పించాక కడప జిల్లాలోనే జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఏ కడప జిల్లాలో అయితే.. తన బాబాయి వివేకానందరెడ్డి హత్య వ్యవహారం ఈ ఎన్నికల మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉన్నదో ఆ జిల్లాలోనే ఆయన తొలిసభలు జరిగాయి. వివేకానందరెడ్డి హత్య కేసు జిల్లాలో ఎంత పెద్ద సంచలనంగా ఇంకా చర్చనీయాంశంగా ఉన్నదో జగన్ కు తెలుసు. వైఎస్ కుటుంబాన్ని ఎంతగానో అభిమానించే జిల్లా ప్రజలకు వివేకాహత్య ఒక పెద్ద షాక్ అని, అది వారిని బాధపెడుతోందని కూడా జగన్ కు తెలుసు. కానీ.. ఆ ఫ్యాక్టర్స్ ఏవీ పట్టించుకోకుండా.. హత్య వెనుక కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మళ్లీ టికెట్ కేటాయించారు జగన్. ఆయన వివేకా హంతకులను కాపాడుతున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇంత జరుగుతుండగా.. ఆయన మాత్రం తన రాజకీయ ప్రత్యర్థుల మీదికే నెట్టడానికి ప్రయత్నిస్తుండడమే తమాషా. తనను ఓడించడానికి మూడు పార్టీలు జతకట్టాయని, అయినా సరే.. తనను ఓడించడం చేతకాదేమోనని భయపడి తన చెల్లెళ్లను కూడా తన మీదికి ఎగదోస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. చెల్లెళ్ల ప్రస్తావన తేవడమే జగన్ లో భయానికి చిహ్నం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ కు నిజాయితీ ఉంటే, స్వచ్ఛమైన రాజకీయాలే చేస్తూ ఉంటే.. ఆయన తన చెల్లెళ్లతో ప్రేమగా, ఆప్యాయంగా ఉండి ఉంటే, వారికి అన్యాయం చేయకుండా ఉంటే.. రాజకీయ ప్రత్యర్థులు ఎగదోసినంత మాత్రేన.. ఆయన చెల్లెళ్లు వారివైపు ఎందుకు మొగ్గుతారు? అనేది ప్రజల మదిలో మెదలుతున్న ప్రశ్న. ఎందుకంటే.. షర్మిల విషయం గమనించినప్పుడు ఆమె ఎన్నో ఏళ్లుగా జగన్ కు దూరమై, ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఇన్నాళ్లూ ఆమెను పట్టించుకోని జగన్.. ఏపీ ఎన్నికల్లోకి ఆమె కాంగ్రెస్ సారథిగా ఎంట్రీ ఇచ్చేసరికి అదేదో తెలుగుదేశం కుట్ర అన్నట్టుగా వారి మీదకు నెట్టేస్తున్నారు. సునీత సంగతి కూడా అంతే. తండ్రి వివేకా హత్య కేసును పరిష్కరించాల్సిందిగా, హంతకులను తేల్చాల్సిందిగా ఆమె జగన్ ను ఎంత వేడుకున్నా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు షర్మిల అండ కూడా తీసుకుని కడపజిల్లాలోనే ఆమె తన ఎన్నికల అవకాశాలకు గండికొడుతుందేమోననే భయంతో మాట మారుస్తున్నారు. అందుకే చెల్లెళ్లను నీమీదకు ఎవ్వరూ ఎగదోయడం లేదు జగన్.. ఇప్పటికైనా వారితో ప్రేమగా వ్యవహరించి, వివేకా హత్య కేసును ఒక కొలిక్కి తీసుకువచ్చి హంతకులకు శిక్ష పడేలాచేస్తే వారు నీ జట్టులోనే ఉంటారు.. అని జిల్లా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.