ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల స్వర్గధామంగా మారబోతున్నది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే కాదు, లక్షల కొలది ఉద్యోగాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్రానికి రానున్నాయి. నిజం చెప్పాలంటే ‘రెండు లక్షలు ఉద్యోగాల కల్పన చేస్తానన్నారు.. ఏమైంది’ అని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని బద్ంనం చేయాలని, భ్రష్టు పట్టించాలని చూస్తూ ఉండే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలకు కన్ను కుట్టే వ్యవహారం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే, ప్రాజెక్టులు ఏర్పడబోతున్నాయంటే.. వాటి ఫలితంగా ఇక్కడ యువతరానికి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయంటే వారు బహుశా ఓర్వలేకపోవచ్చు.
ఐదేళ్లలో తాము ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేకపోగా, వాలంటీర్లు లాంటి బూటకపు వ్యవహారాలు తప్ప ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోగా చంద్రబాబు నాయుడు సర్కారు కేవలం 7 నెలల్లో ఇలాంటి ఘనతను సాధించగలడం అనేది వారికి కన్నుకుట్టే వ్యవహారం మాత్రమే కాదు.. కళ్ళమ్మట నీళ్లు తెప్పించే వ్యవహారం కూడా అవుతుందని గ్రహించాలి!
ఈ ఏడు నెలల్లో పెట్టుబడులపరంగా ప్రభుత్వం సాధించిన ప్రోగ్రెస్ ఏమిటో చంద్రబాబు నాయుడు మీడియాకు వివరించారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ, ఏపీ జెన్ కో, బీపీసీఎల్, రిలయన్స్ వంటి సంస్థలతో సహా ఇతరత్రా అన్నీ కలిపి దాదాపు 6.33 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను ఇప్పటికే ప్రభుత్వం కుదుర్చుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కోట్ల విలువైన పెట్టుబడులంటే చిన్న విషయం ఎంత మాత్రం కాదు. ఈ ఒప్పందాలన్నీ కార్యరూపం దాలిస్తే 4.10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సంస్థలన్నీ ఎంత ఆలస్యంగా చేసినా.. రాబోయే అయిదేళ్లలో పనులు పూర్తిచేసి ఉద్యోగాలు ఇచ్చినాసరే.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని అత్యంత సునాయాసంగా అధిగమించినట్టే అవుతుంది.
ఒకసారి అధికారంలోకి వచ్చి దిగిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి.. పరిపాలన గురించిన అవగాహన మాత్రం రాలేదని ఆయన మాటలను బట్టి అందరికీ అర్థమవుతుంటుంది. ఎందుకంటే.. గెలిచిన రెండు నెలల వ్యవధిలోనే.. ఆయన ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రారంభించారు. రెండులక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు… ఏవీ ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు.. ఏకంగా 4.10 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటూ చెబుతున్నారు.
యువతరానికి పెద్ద శుభవార్త ఇది. ఇవన్నీ కేవలం ఇప్పటికే ప్రభుత్వంతో ఆయా సంస్థలు ఏర్పాటుచేసుకున్న ఒప్పందాల ఫలితంగా వచ్చే ఉద్యోగాలు మాత్రమే. రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విశాఖలో ఏర్పాటుచేస్తున్న గూగుల్ హబ్ ద్వారా.. శిక్షణలు పొందే లక్షల మంది ఇతరత్రా ఉద్యోగాల్లోనూ, ఉపాధుల్లోనూ స్థిరపడతారు. అవన్నీ కూడా అదనం అని లెక్కవేసుకోవాలి. రాబోయే అయిదేళ్లు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు మాత్రమే కాకుండా.. ఉద్యోగాల ఆశావహులకు కూడా స్వర్గధామంగా మారబోతున్నదని అర్థమవుతోంది.