స్వతంత్రంగా’ వైసీపీని మట్టుపెట్టిన ప్రియాంక!

ఆమెను చూస్తే ఇంకా పసితనం ఛాయలు వీడని యువతిలాగానే కనిపిస్తారు. కానీ విశాఖపట్టణం కార్పొరేషన్ రాజకీయాలకు సంబంధించినంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో మట్టి కరిపించారు. ఎలాంటి హడావుడి లేకుండానే.. ఆర్భాటపు ప్రకటనలు, రెచ్చిపోయి మాట్లాడడాలు ఇవేమీ లేకుండానే.. సైలెంట్ గా పని పూర్తిచేశారు. ఇవాళ ధర్మం గెలిచిందని, న్యాయం గెలిచిందని.. అంటూ, విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గినందుకు కూటమి నాయకులు మాట్లాడుతున్నారు గానీ.. ఆ కూటమి విజయం వెనుక ఆమె పాత్ర తిరుగులేనిది అని చెప్పాలి. ఆమె మరెవ్వరో కాదు.. ముత్తంశెట్టి ప్రియాంక. మాజీ ఎమ్మెల్యే, ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాకూడా చేసిన ముత్తంశెట్టి శ్రీనివాస్ కూతురు. ఆమె వైసీపీకి రాజీనామా చేసి.. ఏ పార్టీలో చేరకుండా ‘స్వతంత్రంగా’ వ్యవహరిస్తూనే కూటమి విజయం కీలక భూమిక పోషించారు.

విశాఖ నగర కార్పొరేషన్ మేయర్ హరివెంకట కుమారి మీద కూటమి నాయకులు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగాలంటేనే కనీసం 74 మంది హాజరు కావాలి. ఆ మాత్రం హాజరు లేకపోతే కోరం లేదని సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీలో మిగిలిన కార్పొరేటర్లు అందరినీ.. కట్టడి చేసి వారికి విప్ జారీ చేస్తే అసలు సమావేశానికి కోరం లేకుండాపోతుందని, అవిశ్వాసం వీగిపోతుందని వారు ఆశించారు.

నిజానికి అప్పటికి కూటమి పార్టీలకు అవసరమైనంత బలం లేదు. వారి పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉన్నారు కాబట్టి.. ఎక్స్ అఫీషియో సభ్యులందరినీ కలుపుకుంటే కూడా కూటమి బలం 72 గా మాత్రమే ఉంది. అసలు కోరం కోసం ఇంకా ఇద్దరు కావాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిప్పల నాగిరెడ్డ కొడుకు వంశీరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి కొణతల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. బలం 73కు చేరింది. ఇంకా ఒక్కరుకావాలి!

ఇలాంటి పరిస్థితుల్లో ముత్తంశెట్టి ప్రియాంక వైసీపీకి రాజీనామా చేశారు. నిజానికి ఆమె తండ్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చాలా నెలల కిందటే రాజీనామా చేసేశారు. అయితే ఆమె కూటమి పార్టీల్లో చేరలేదు. వారికి మద్దతు ఇవ్వాలనే రూలేం లేదు. అలాంటి పరిస్థితుల్లో ‘స్వతంత్ర’ సభ్యురాలిగా మిగిలిన ఆమె వైఖరి ఎలా ఉంటుందనేదే.. అన్నింటికంటె కీలకాంశం అయింది. 73 మంది సభ్యులు మాత్రమే కూటమికి ఉండగా.. కోరం ఉంటుందా లేదా అనే పరిస్థితుల్లో ప్రియాంక వచ్చారు. సమావేశం జరిగింది. ఆమె కూడా అవిశ్వాసతీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కూటమి పరువు దక్కించుకుంది. అవిశ్వాసం నెగ్గింది.
అయితే ముత్తంశెట్టి తండ్రీకూతుళ్లు శ్రీనివాస్- ప్రియాంక ఇద్దరూ కలిసి త్వరలోనే కూటమి పార్టీల్లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories