ముందు జాగ్రత్త: పార్టీ సారథ్యానికి సిద్ధమవుతున్న భారతి!

విపత్కర పరిస్థితుల్లో కనీసం ప్రెస్ మీట్ పెట్టి లేదా, వీడియో సందేశం విడుదల చేసి పార్టీ అభిమానుల్లో కాస్త ఉత్సాహం, స్ఫూర్తి నింపడానికి ఇప్పుడు కన్నతల్లి విజయమ్మ అండ వారికి లేదు. అనూహ్యమైన గడ్డు రోజులు సంప్రాప్తించినప్పుడు.. ఆదుకోవడానికి పార్టీ తాత్కాలిక సారథ్య బాధ్యతలు స్వీకరించి దూకుడుగా ముందుకు పోవడానికి చెల్లెలు షర్మిల కూడా లేదు. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ఏమైనా అనుకోని పరిస్థితులు వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దిక్కెవ్వరు? అలాంటి రోజు వచ్చినప్పుడు.. గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు జగన్ భార్య వైఎస్ భారతి ఇప్పటినుంచే సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీ సారథ్యం అవసరమైనప్పుడు అందుకోవడానికి ఆమె రెడీగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. రాష్ట్ర గవర్నరు అబ్దుల్ నజీర్  ను జగన్ అండ్ కో కలవడానికి వెళ్లినప్పుడు.. భారతి కూడా వెంట వెళ్లడానికి నిర్ణయించుకోవడమే ఇందుకు నిదర్శనం అని పలువురు అంటున్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నరు అబ్దుల్ నజీర్ ను కలవబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదివరలో కూడా ఒకసారి జగన్ గవర్నరును కలిసి, ప్రభుత్వం మీద ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు కలిసినాకూడా కొత్త పాయింటు ఏమీ ఉండదు. కూటమి సర్కారు పాలనలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి.. అని అడుగుతారు. అయితే అంతకు మించిన ప్రత్యేకత ఈసారి కలయికకు ఉండబోతోంది. జగన్ గవర్నరును కలవడానికి వెళ్లినప్పుడు ఆయన వెంట ఉండడానికి రాష్ట్రంలోని వైసీపీ కీలక నాయకులందరినీ రమ్మని పిలిచారు. వీరందరితో పాటు ఆయన భార్య వైఎస్ భారతి కూడా గవర్నరు వద్దకు వెళ్లబోతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ పరిణామం ఆసక్తికరంగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ ఎన్నికల్లో పోటీచేసినప్పుడు.. పులివెందులలో ఆయన తరఫున వెళ్లి నామినేషన్ వేయడమూ, ఆయన తరఫున నియోజకవర్గంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తప్ప.. వైఎస్ భారతి రాజకీయ కార్యక్రమాల్లో ఎన్నడూ పాల్గొనదు. కనీసం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో హిందూ ఆలయాలకు వెళ్లి అక్కడి సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా వైఎస్ భారతి ఆయన వెంట వెళ్లరు. అలాటిది.. పార్టీ తరఫున గవర్నరు వద్దకు ఆమెకూడా వెళ్తారనే వార్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

ఇదంతా ఆమె పార్టీ సారథ్యం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నదనే సంకేతాలు అని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే.. లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే సిట్ దర్యాప్తు చాలా దూరం వెళ్లింది. 13 మంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు. మరో 12 మంది అరెస్టుకు నాన్ బెయిలబుల్ వారంట్లు కూడా తీసుకున్నారు. పైగా ఈ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు, సూత్రధారి సమస్తం జగన్ అనే ఆధారాలు పోలీసులకు లభించాయి. ఇలాంటి నేపథ్యంలో ఏ క్షణంలో అయినా జగన్ అరెస్టు కూడా జరగవచ్చుననే భయం ఆ పార్టీలో ఉంది.

ఒకవేళ జగన్ అరెస్టు అయి జైలుకు వెళ్లవలసి వస్తే.. ఆ సమయానికి పార్టీ బాధ్యతలు చూసుకోవడానికి భారతి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు గవర్నరుతో భేటీకి వెళ్లడం ద్వారా ఇవ్వబోతున్నారు. ఇప్పడు. జగన్ పరోక్షంలో పార్టీకి దిక్కుగా ఉండడానికి విజయమ్మ, షర్మిల కూడా లేరు. మరొకరిని జగన్ నమ్మే అవకాశం లేదు. అందువల్ల జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తే.. భారతికి పగ్గాలు అప్పగించి వెళ్తారని అంతా అనుకుంటున్నారు. ఈ గుసగుసలు ఏమేరకు నిజమౌతాయో వేచిచూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories