వైనాట్ 175 అంటూ ఏదో కామెడీ డైలాగులాగా పలకడం లేదు. మొత్తం 175 స్థానాలను మనమే గెలుస్తున్నాం.. అంటూ సొంత కార్యకర్తలు కూడా చాటుగా నవ్వుకునేలా ఒక ట్రాన్స్ లో మాట్లాడడం లేదు. చంద్రబాబునాయుడు చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో 160 స్థానాలు గెలవబోతున్నాం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ‘నెంబర్’ కాస్త ఆచరణాత్మకంగానే కనిపిస్తోంది. అయితే ఒక్క సీటు విషయంలో చంద్రబాబు విసిరిన సవాలు మాత్రం.. వైఎస్సార్ కాంగ్రెస్ దళాల్లో వణుకు పుట్టిస్తోంది. అదే జరిగితే తమ పార్టీ పరువు మొత్తం గంగలో కలుస్తుందని వారు భయపడుతున్నారు.
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కు 151 స్థానాలు వచ్చాయి. ఆ బలం చూసుకుని అధికారంలోకి వచ్చిన తొలినాటినుంచి ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి విధ్వంసక పాలనకు శ్రీకారం చుట్టారు. అయిదేళ్లుగా అదే జరుగుతోంది. అపరిమితమైన అపకీర్తిని మూటగట్టుకున్నారు. ఇప్పుడు రాజకీయ వాతావరణం మొత్తం తిరగబడింది. గత ఎన్నికల్లో ఏయే జిల్లాల్లో అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసి.. 151 సీట్లను సాధించిందో.. అలాంటి జిల్లాల్లో ఈసారి ఫిఫ్టీ ఫిఫ్టీ నెగ్గే చాన్సు కూడా కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో కూడా.. చంద్రబాబునాయుడు.. 175 గెలుస్తాం లాంటి డైలాగులు చెప్పకుండా ప్రాక్టికల్ గా తమ కూటమి 160 సీట్లు గెలుస్తుందని అంటున్నారు.
ఇదే సమయంలో.. ఆయన వైసీపీకి మరో సవాలు విసిరారు. కడప ఎంపీస్థానాన్ని మన పార్టీ గెలవబోతున్నదని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా గట్టి సవాలు.
ఆయన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయడం వెనుక కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికే జగన్ మళ్లీ అక్కడ టికెట్ ఇచ్చారు. తన తండ్రిని చంపించిన అవినాష్ కు వ్యతిరేకంగా రాజకీయ ప్రచార బరిలో వివేకా కూతురు సునీత పనిచేయబోతున్నారు. పైగా, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల అదే నియోజకవర్గం నుంచి పోటీచేయబోతున్నారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వైసీపీని దెబ్బకొట్టే అవకాశం ఉన్నందున తెలుగుదేశం గెలుపు సునాయాసం అవుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నట్టుగా ఉంది. తెలుగుదేశం కడప ఎంపీ స్థానాన్ని గెలవడమే జరిగితే గనుక.. అదే వివేకా హత్య కేసులో నిందితులు ఎవరనే విషయంలో ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించాల్సి ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.