వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు తరచుగా యాత్రలు ప్లాన్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ మూల చీమ చిటుక్కుమన్నా సరే.. అక్కడకు ఒక పరామర్శ యాత్ర పెడుతున్నారు. తన పార్టీ గణాలందరికీ పురమాయిస్తున్నారు. వేల సంఖ్యలో జనాన్ని తోలించాలని ఆదేశాలు ఇస్తున్నారు. డబ్బు సరఫరా చేస్తున్నారు. వచ్చిన జనాలతో ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేయిస్తున్నారు. ఆ నినాదాలు విని మురిసిపోతున్నారు. ఆయన యాత్రలు ఒక ప్రహసనంలాగా సాగుతున్నాయి. అయితే జగన్ గానీ, ఆయన పర్యటనలు ముగిసిన తర్వాత ఆయన వందిమాగధులు గానీ.. ఒకటే డైలాగు వేస్తుంటారు. ‘జగనన్నకు దక్కుతున్న ప్రజాదరణ చూసి ప్రభుత్వం వణుకుతున్నదట.. ఆయన పర్యటనలకు జనం వెల్లువలా వస్తుండడం చూసి.. దానికి గండికొట్టడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని.. రకారకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.
జగన్ కు జనాదరణ అంతగా ఉన్నదనేది నమ్మడానికి జనం ఏమైనా వెర్రి వారు అనుకుంటున్నారా? అనేది విశ్లేషకుల మాట. రాజకీయ కార్యక్రమాలకు వేలం వెర్రిగా జనం వచ్చే రోజులు ఎన్నడో పోయాయి. జనాన్ని డబ్బులు ఇచ్చి తోలించడం రివాజు అయింది. డబ్బులు, బిర్యానీ పొట్లాలు, లిక్కర్ సీసాలు పంపిణీ కాకుండా, ఆహామీ లేకుండా జనం ఇంట్లోంచి అడుగు బయటపెట్టడం లేదు. జగన్ కు వస్తున్న జనం కూడా ఎలా వస్తున్నారో ప్రజలందరికీ తెలుసు.
అలాకాకుండా.. వైసీపీ నాయకులు చెబుతున్నట్టుగా జనం వస్తున్నారేమో ఆలోచిద్దాం. అసలు అధికారం లేని, అసెంబ్లీకి వెళ్లే అలవాటు కూడా లేని వ్యక్తి కోసం.. తన పార్టీ నిధులనుంచి అయినా నయాపైసా సాయం చేయని వ్యక్తికోసం కష్టాలు చెప్పుకోడానికి జనం ఎందుకు వస్తారు? ఏం లాజిక్ ఉంది? అధికారంలో లేని, మళ్లీ అధికారంలోకి వస్తాడో రాడో తెలియని నాయకుడి కోసం ఇవాళ జనం వెల్లువలా వస్తుండడం నిజం అనుకుంటే.. ఇదే జనం.. అదే నాయకుడు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడకుపోయారు? ఆరోజున ఈజనం మీద ప్రేమతో జగన్ ర్యాలీలు నిర్వహించలేదు ఎందుకు? జగన్ ఒక ఊరికి వస్తున్నాడంటేనే ఆ ఊర్లో కర్ఫ్యూ వాతావరణాల్ని ఎందుకు విధించారు? రోడ్లకు ఇరువైపులా బారికేడ్లు కట్టించి, దుకాణాలు మూయించి, రోడ్లపై ఉన్న చెట్లను అడ్డంగా నరికించి దుర్మార్గాలకు పాల్పడ్డారు ఎందుకు? ఇప్పుడు ఎగబడుతున్న జనానికి జగన్ మీద ప్రేమ, ఆ జనానికి షేక్ హ్యాండ్ లు ఇచ్చి తోపులాటలు జరగాలని కోరుకునే జగన్ ప్రేమ ఆనాడు ఏమయ్యాయి? అనేది విశ్లేషకుల్లో కలుగుతున్న సందేహం.
జగన్ కు నిజంగా జనాదరణ ఉంటే గనుక.. ఆయన అధికారంలో ఉన్న రోజుల్లో కూడా ఇదే తరహాలో ప్రజల్లోకి వెళ్లి ఉండాలి. అలా చేయకుండా.. ఇప్పుడు మాత్రం ఆదరణ మాటెత్తుతున్నారంటే.. మొత్తం ఒక డ్రామాగా పరిగణించాల్సిందే తప్ప మరొకటి కాదు.