స్థానిక సంస్థలకు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తమ పెత్తనం నిరూపించుకోవాలనే దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మునిసిపాలిటీ పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. అక్కడి తెలుగుదేశం నాయకులను ప్రలోభ పెట్టి, బెదిరించి బలవంతంగా తమ పార్టీలో చేర్చుకున్నారు. మొత్తానికి కుప్పం మునిసిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించినట్లుగా చెప్పుకోగలిగారు. కానీ రాజకీయం పునరావృతం అవుతుందనేందుకు చిహ్నంగా ఇప్పుడు అదే మాదిరి పరిస్థితులు మళ్లీ ఏర్పడుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కుప్పం మునిసిపాలిటీ తెలుగుదేశం పార్టీ పరం అవుతుందా? అనే అంచనాలు రాజకీయ వర్గాలలో సాగుతున్నాయి. పులివెందుల మునిసిపాలిటీ తమ చేజారి తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లకుండా ఉండేందుకు నష్ట నివారణ కోసం కడప ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగారు. కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయకుండా బుజ్జగించేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
పులివెందుల నియోజకవర్గంలో పాడా పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి కొన్ని అభివృద్ధి పనులు చేయించారు జగన్. మునిసిపాలిటీ కౌన్సిలర్లే కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఈ పనులు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది గాని వారికి సకాలంలో బిల్లులు చెల్లించలేదు. అధికారం నుంచి దిగిపోయే ముందు కూడా తమకు కావాల్సిన బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించేసిన జగన్ సర్కారు, పులివెందుల లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు చిన్న చిన్న మొత్తాలు కూడా చెల్లింపు చేయలేదు. పాడా పరిధిలో జరిగిన పనులు మొత్తం విలువ 250 కోట్ల వరకు ఉంటుందనేది అంచనా.
ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ఎగ్గొట్టి పులివెందుల చేరుకున్న సమయంలో కౌన్సిలర్లంతా ఆయన మీద ఒత్తిడి తీసుకువచ్చారు. తమ బిల్లుల సంగతి ఏంటంటూ మొరపెట్టుకున్నారు. అధికారంలో ఉండగానే చెల్లింపులు చేసి ఉంటే బాగుండేదని ఆయన తీరును నిందించారు. వారి ఒత్తిడి భరించలేకనే ఐదు రోజులుగా ప్లాన్ చేసుకున్న పర్యటన రెండు రోజులకే ముగించుకుని జగన్మోహన్ రెడ్డి భార్యా సమేతంగా బెంగళూరు ప్యాలెస్ పారిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే బిల్లులో చెల్లింపులు జరగకపోతే తమ పరిస్థితి దుర్భరంగా మారుతుందనే భయంతో పులివెందుల మునిసిపాలిటీ కౌన్సిలర్లు తెలుగుదేశం లో చేరడానికి నిర్ణయించుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
జగన్ సొంత నియోజకవర్గంలోనే తమ కౌన్సిలర్లు పార్టీ మారితే పరువు మొత్తం సర్వనాశనం అవుతుందనే భయంతో అవినాష్ రెడ్డి వారందరితో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ వీడవద్దని కోర్టుకు వెళ్లి అయినా బిల్లులు సాధించుకుందామని నచ్చ చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే కౌన్సిలర్లు మాత్రం తమకు బిల్లులు రావడమే ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుందని ఇతరత్రా మాటలు చెప్పడం వలన ఉపయోగం లేదని అవినాష్ రెడ్డికి తెగేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి పులివెందుల మున్సిపాలిటీ చేజారుతుందనే భయం జగన్ దళంలో ఇప్పుడు పుష్కలంగా కనిపిస్తోంది.