పీకే సెటైర్ : వైసీపీకి కూడా గొంతు తడారిపోనుందా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కేవలం పార్టీలు గెలవడానికి సలహాలు చెప్పడం, ప్రజల నాడిని అంచనా వేస్తుండడం మాత్రమే కాదు.. స్వయంగా రాజకీయ నాయకుడు కూడా. బీహార్ రాజకీయాలలో తన ముద్ర చూపించే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి రాజకీయ నాయకుడు ప్రశాంత్ కిశోర్.. రాజకీయ నాయకుల  విమర్శలు- ప్రతి విమర్శలకు అదే రేంజిలో కౌంటర్లు ఇవ్వకుండా ఎందుకుంటారు? అందుకే ఈసారి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో తన అంచనాలను విమర్శిస్తున్న వారికి చాలా ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. జూన్ 4వతేదీన, అంటే ఫలితాలు వెలువడే రోజు, మీరంతా గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి అని పీకే సలహా ఇస్తున్నాడు.

ప్రశాంత్ కిశోర్ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఎవ్వరికీ అనుకూలంగా పనిచేయడం లేదు. మోడీతో కూడా ఆయనకు విభేదాలున్నాయి. మోడీ సర్కారు మీద చాలా విమర్శలు చేస్తుంటారు. అయినా సరే.. ఈసారి ఎన్నికల్లో మళ్లీ మోడీ సర్కారు ఏర్పడుతుందని ఆయన చెబుతుండడం గమనార్హం. మోడీ ఆశిస్తున్నట్లుగా 400 సీట్లు దాటకపోవచ్చు గానీ.. ఇప్పుడున్న బలానికి సమానంగా సీట్లు దక్కవచ్చునని ఆయన అంటున్నారు. దీనిమీద కూడా కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి చెందిన దళాలు పీకే మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వారు మాత్రమే కాదు.. ఏపీలో వైసీపీ దళాలు కూడా ఆయనను అదేపనిగా ఆడిపోసుకుంటున్నాయి.

ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించబోయేది లేదని ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. అలాగని ఆయన ఈ ఎన్నికల్లో తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయలేదు. కానీ, ఆయన స్థాపించిన సంస్థ ఐప్యాక్ వైసీపీకోసం పనిచేసింది. అయినా సరే ఆయన అంచనాలు మాత్రం చంద్రబాబు సీఎం అవుతారనే చెప్పాయి. దీని మీద వైసీపీ నాయకులు పీకేను ఒక రేంజిలో ఆడుకున్నారు. ఆయన ప్రజల నాడిని పసిగట్టే శక్తిపోయిందని ఎగతాళి చేశారు.

బహుశా ఇలాంటి వైసీపీ నేతల్ని కూడా కామన్ గానే ఉద్దేశిస్తే అన్నారేమో.. పీకే, ఫలితాలు వెలువడే రోజున.. తన అంచనాలను తప్పుపట్టేవాళ్లంతా గొంతు తడారిపోకుండా నీళ్లు పక్కన పెట్టుకోవాలని సెటైర్ వేస్తున్నారు. మరి జగన్ అండ్ కో.. కాస్త చల్లటి నీళ్లను పెట్టుకుంటే మంచిదేమో!

Related Posts

Comments

spot_img

Recent Stories