ఎలాంటి శషబిషలకు ఆస్కారం లేదు. ఆయన ఎవరి మెహర్బానీ కోసం ప్రయత్నించడం లేదు. తన బృందాల పరిశీలనలో, తన అనుభవంలో తన బుద్ధికి తోచినదేదో విస్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెబుతున్నారు. ఆయన ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా విస్తృతమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించిన ప్రశాంత్ కిషోర్ కాగా- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఆయన వెల్లడిస్తున్న తాజా సంగతి జగన్ మళ్ళీ గెలవడం అసాధ్యం అనేదే! గత 2019 ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారం ఏర్పాటు చేయడంలో కీలకంగా నిలిచి, అవసరమైన వ్యూహాలను తమకు అందించిన వ్యక్తే.. ఈసారి తాము గెలవడం లేదని బహిరంగ వేదికల మీద చెప్పేస్తుండడంపై జగన్ కోటరీలో భయం మొదలవుతోంది. జగన్ కూడా పీకే వ్యాఖ్యలపట్ల విపరీతమైన అసహనానికి గురవుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ఓటమి గురించి ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పడం ఇది మొదటి సారి కాదు. గతంలో ఇండియాటుడే వారి కార్యక్రమంలో కూడా ఆయన జగన్ గురించి ఇదే అంచనాలను వెల్లడించారు. జగన్ తనను తాను ఒక రాజులా భావించుకుంటున్నారని, ప్రజలకు అవసరమైనవన్నీ తాను ఇచ్చేస్తే చాలునని, ఇక రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదని ఆయన భావిస్తున్నారని పీకే అంచనా వేశారు. ప్రజలు తనకు ఎన్నటికీ విధేయులుగా పడి ఉండాలని జగన్ కోరుకుంటున్నారని, తనను ప్రజలు దేవుడిగా చూడాలని కూడా అనుకుంటున్నారని ప్రశాంత్ కిశోర్ ఆయన విశ్లేషణను వెల్లడించారు. అయితే ఇలాంటి వైఖరి ప్రజాస్వామ్యంలో పనిచేయదన్న పీకే.. జగన్ ఓటమి తథ్యం అని గతంలో అన్నారు.
ఈదఫా పీటీఐ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకాస్త విపులంగా ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పతనాన్ని జగన్ కు జరగబోయే దానికి ఉదాహరణగా చెప్పడం విశేషం. ఆయన కూడా కేవలం తాయిలాలు ఇవ్వడమే తప్ప యువతకు ఉద్యోగాల కల్పేన గురించి గానీ.. అభివృద్ధి గురించి గానీ పట్టించుకోలేదని అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు ఒక సహజమైన అలవాటు ఉంది. ఎవరి గురించి అయినా వారు భయపడినప్పుడు, ఆ భయంలో విపరీతంగా విమర్శల దాడికి దిగుతారు. పచ్చి బూతులు లంకించుకుంటారు.
గతంలో పీకే మాట్లాడినప్పుడు కూడా ఇదే జరిగింది. ఆయనకు పిచ్చి పట్టిందని, చెల్లని నాణెం అని రకరకాల నిందలు వేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం సమయంలో.. పీకే మాటలు రాష్ట్రంలోని తటస్థ ఓటర్లలను ఎంతో కొంత మేర ప్రభావితం చేయగల అవకాశం ఉన్న తరుణంలో జగన్ బ్యాచ్ లో అసహనం తారస్థాయికి చేరుతున్న్టట్టు తెలుస్తోంది. రాబోయే కొన్ని రోజుల పాటు పీకేను తిట్టడం కూడా ఎజెండాగా పెట్టుకున్నట్టుగా పార్టీ వర్గాలద్వారా తెలుస్తోంది.