పాపం షర్మిల.. జెండా ఎత్తేలోగా తెరపడిపోతోంది!!

వైయస్ షర్మిల కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ప్రస్థానం అంత ఆశాజనకంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఆమె ఏ పనిచేయదలచుకున్నా.. దానికి కొనసాగింపు ఉండడం లేదు. ఆమె పోరాడదలచుకుంటే అసలు సమస్యే లేకుండాపోతోంది. లేదా.. ప్రజలు పట్టించుకోని పోరాటం అవుతోంది. ఇలాంటి రకరకాల చిత్రమైన కష్టాలు పడుతున్నారు షర్మిల.

అన్న జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి 2019 ఎన్నికలలో శాయశక్తులా కష్టపడి పనిచేసిన షర్మిల, ఎన్నికల అనంతరం తన కష్టానికి తగిన ప్రతిఫలంగానీ, రాజకీయ ప్రయోజనం గానీ దక్కలేదనే ఆగ్రహంతో.. విభేదించి దూరం జరిగారు. కేవలం తెలంగాణ రాజకీయాలకు మాత్రం పరిమితం అయ్యారు. అక్కడ సొంత పార్టీని స్థాపించి- కేసీఆర్ ను ఓడించి తాను ముఖ్యమంత్రి అవుతానని ప్రగల్భాలుపలికారు. చివరికి ఒక్క స్థానంలోనైనా పోటీ చేసే సత్తా లేక కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సారధిగా నియమితురాలైన షర్మిల సార్వత్రిక ఎన్నికలలో కడప ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు అనే ముద్ర ఆమెకు ఎంత మాత్రం ఉపయోగపడలేదు. ‘‘వైఎస్ బిడ్డని.. వైఎస్ బిడ్డని..’’ అని పదే పదే చెప్పుకున్నప్పటికీ ఆమెకు ప్రయోజనం దక్కలేదు. రాజశేఖర్ రెడ్డిని గాని, జగన్ మోహన్ రెడ్డిని గాని, వారి కుటుంబం నుంచి ఎవరు వస్తే వారిని అనేకమార్లు గెలిపించిన కడప పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు షర్మిల జోలికి కూడా రాలేదు. ఇదంతా ఆమెకు పెద్ద ఆశనిపాతం అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు కూడా రకరకాలుగా విఫలమవుతున్నాయి. ఎలాగంటే ఆల్రెడీ మునిగిపోయిన సబ్జెక్టు అయినా ప్రత్యేక హోదాను షర్మిల భుజానికి ఎత్తుకున్నారు. ప్రత్యేక హోదాను కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఇవ్వకుండా మోసం చేస్తున్నదని, అడగకుండా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆమె గుర్తొచ్చినప్పుడల్లా అంటూనే ఉంటారు. అయితే వైయస్ షర్మిల ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ఇక ప్రత్యేక హోదా అనేది రాదు గాక రాదు అనే సంగతి అని గుర్తించడం లేదు. అసలు ఏపీ ప్రజలు కూడా ప్రత్యేకహోదా అనే టాపిక్ ను మరచిపోయారు.

అదే విధంగా కేంద్రం మీద నిందలు వేయడానికి ఎక్కువ తాపత్రయ పడుతూ ఉండే షర్మిల విశాఖ రైల్వే జోన్ గురించి కూడా ప్రస్తావించారు. కానీ ఆమె ఆ పోరాటాన్ని భుజానికి ఎత్తుకునే లోగా జోన్ మంజూరు అయిపోయి పనులు కూడా జరుగుతున్నాయి. అంతకంటే దయనీయమైన పరిస్థితి ఏమిటంటే- విశాఖ ఉక్కు కోసం తాను ఎలాంటి పోరాటానికైనా సిద్ధం అని షర్మిల ప్రకటించడం! తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం పట్ల అంతా తమ ఘనతే అన్నట్టుగా షర్మిల చెప్పుకుంటున్నారు. తాము ఇచ్చిన 48 గంటల గడువుకు యాజమాన్యం జడుసుకుని వారందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నదని ఆమె చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం అంటున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పిలుపిస్తున్నారు. కానీ ఆమె దురదృష్టం ఏంటంటే కేంద్రానికి అసలు ప్రైవేటీకరణ ఆలోచనేలేదని సాక్షాత్తు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించడం! ఈ రకంగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవనెత్తుతున్న పోరాటాలు అంతకంటే ముందే పాచిపోయి ఉంటున్నాయి.. లేదా పరిష్కారం కూడా జరిగిపోయి ఉండడం కనిపిస్తుంది. అందుకే ఏపీలో ఆమె రాజకీయ ప్రస్థానం అంత ఆశాజనకంగా సాగడం లేదని జనం నవ్వుకుంటున్నా రు.

Related Posts

Comments

spot_img

Recent Stories