మరీ కామెడీగా ఉన్న పిన్నెల్లి బొంకులు!

వినేవాడు ఎప్పుడూ చెప్పేవాడికి లోకువ అని సామెత. పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు, సీఐ మీద హత్యాయత్నం చేసిన కేసుల్లో అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి.. పోలీసుల విచారణలో, ఇదే తరహాలో, తలాతోకాలేని సమాధానాలు చెబుతున్నారు. ఆయనను రెండురోజుల పోలీసు కస్టడీకి హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. మాచర్ల పోలీసులు వెళ్లినప్పుడు తొలుత లోపలకు రానివ్వకుండా బయటే ఉంచేసిన జైలు అధికారులు, మళ్లీ కోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత అనుమతించారు. మొత్తానికి పిన్నెల్లిని పోలీసులు విచారించడం సాయంత్రం 7 వరకు సాగింది. అయితే ఆయన పోలీసుల ప్రశ్నలకు చెప్పిన సమాధానాలే కామెడీగా ఉన్నాయి. 
పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రానికి అసలు తాను వెళ్లనే లేదని, ఈవీఎంను పగలగొట్టనే లేదని, నంబూరి శేషగిరిరావు (అక్కడి తెదేపా ఏజంటు, ఎమ్మెల్యే దాడికి గురైన వ్యక్తి) ఎవరో తనకు తెలియనే తెలియదని.. విచ్చలవిడిగా పిన్నెల్లి పోలీసులతో అబద్ధాలు చెప్పడం గమనార్హం. తాను స్వయంగా బూత్ లోకి అనుచరుల సహా చొరబడి.. అక్కడి ఈవీఎంను దారుణంగా నేలకేసి పగలగొట్టి, రెండోసారి కూడా దాన్ని ఎత్తుకుని మళ్లీ పగలగొట్టిన వీడియో.. ఎంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిపోయిందో స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా.. ఆ వీడియోలో తాను చాలా స్పష్టంగా కనిపిస్తున్నానని తెలిసినా కూడా.. పిన్నెల్లి అసలు పాల్వాయి గేటు వెళ్లనే లేదనే అబద్ధాలు చెబుతున్నారంటే.. అందుకు చాలా గుండె ధైర్యం, బరితెగింపు కావాలని విశ్లేషకులు భావిస్తున్నారు. 
తొలిరోజు విచారణలో పిన్నెల్లి పోలీసులకు ఏమాత్రం సహకరించలేదని వార్తలు వస్తున్నాయి. రెండోరోజు విచారణలో.. సీఐపై హత్యకు ప్రయత్నించిన కేసు గురించి పోలీసులు ఆయనను విచారించే అవకాశం ఉంది. అయితే ఆ దాడి కేసుకు సంబంధించి.. పిన్నెల్లి ఇంకెన్ని చిత్రమైన జవాబులు చెబుతారో చూడాలి. 
ఇవాళ్టి రోజుల్లో గూగుల్ ట్రాకింగ్ ద్వారా.. పాల్వాయి గేటుకు వెళ్లివచ్చిన తర్వాత.. వెళ్లలేదని చెప్పి తప్పించుకోవడం చాలా కష్టం. అంత టెక్నాలజీ పిన్నెల్లి కేసుకు అనవసరం. చాలా స్పష్టమైన.. ఈసీ ఏర్పాటుచేసిన సీసీ టీవీ ఫుటేజీ ఉంది. అందులో ఆయన ఈవీఎంను పగలగొట్టడం చక్కగా రికార్డు అయింది. ఆ వీడియో చూపించినా సరే.. పిన్నెల్లి అందులో ఉన్నది నేను కాదు నా డూప్ అని గానీ.. లేదా బాహుబలి రేంజి గ్రాఫిక్స్ తో ఏఐ టెక్నాలజీ తో ఫ్యాబ్రికేట్ చేసిన వీడియో అని గానీ చెప్తారేమో అని ప్రజలు నవ్వుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories