పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో ఈవీఎంలు ధ్వంసం చేసిన నేరానికి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేసి తీరుతాం అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చాలా గట్టిగానే ప్రకటించారు. అయితే అరెస్టు ఉచ్చును తప్పించుకోవడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా తెలివిగా పోలీసులు కళ్ళుగప్పి పారిపోయారు. మరో రోజున అమరావతి హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆయనకు కొంత ఉపశమనం కలిగించింది. హైకోర్టు ఇచ్చిన రిలాక్సేషన్ చూసుకుని మురిసిపోయేలోగా కోర్టు ఆయనకు మరో బ్రేకు వేసింది.
జూన్ ఆరో తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఆదేశించినంత మాత్రాన.. పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి.. యథేచ్ఛగా చెలరేగిపోవచ్చునని అర్థం కాదు. కోర్టు ఆయనకు అనేక ఆంక్షలు విదించింది. జూన్ 6 వరకు పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన నరసరావుపేటలో మాత్రమే ఉండాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఓట్ల లెక్కింపు కేంద్రం మరొక చోట ఉన్నట్లయితే.. లెక్కింపు రోజు మాత్రమే అక్కడకు వెళ్లాలని, మిగతా సమయం నరసరావుపేట నుంచి కదలకూడదని నిబంధన. కేసు గురించి మీడియాతో ఎక్కడా మాట్లాడకూడదని కూడా నిబంధన విధించారు. వీటన్నింటికి మించి.. మాచర్ల నియోజకవర్గంలో అసలు అడుగుపెట్టడానికి కూడా వీల్లేదని హైకోర్టు ఆదేశించడం విశేషం.
ఏ షరతును ఉల్లంఘించినా.. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు, ఇతర చర్యలు తీసుకునేందుకు పోలీసులకు కోర్టు స్వేచ్ఛ ఇచ్చింది. నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో కూడా కోర్టు ఇదే తరహా నిబంధనలు విధించింది. కోర్టు ఉత్తర్వులు అన్నీ.. హింసను ప్రేరేపిస్తున్న వైసీపీ అభ్యర్థులను కట్టడి చేయడానికి, ముకుతాడు వేయడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.