లీగల్ పాయింట్లతో బుకాయించాలనుకుంటున్న జగన్!

సోషల్ మీడియా కార్యకర్తల ముసుగులో విచ్చలవిడిగా అసభ్యకరమైన పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలమీద ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కత్తి ఝుళిపిస్తుండడంతో పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడానికి పెయిడ్ బ్యాచ్ భయపడుతుండడంతో పార్టీ చాలా అవమానంగా ఫీలవుతోంది. సోషల్ మీడియా వారి అరెస్టులతో ఊపిరాడకుండా పోతున్న జగన్మోహన్ రెడ్డి చాలా అసహనానికి గురవుతున్నారు. ఈ ఆవేదన వెళ్లగక్కడానికి ప్రెస్ మీట్ పెట్టి మరీ రెచ్చిపోయారు. అనేక లీగల్ పాయింట్లు మాట్లాడారు. అయితే ఆయన లీగల్ అంశాలను ప్రస్తావించి బురద చల్లినప్పటికీ అందులో అనేక లొసుగులు కనిపిస్తున్నాయి. అవేంటో కాస్త చూద్దాం..

=) జగన్ ఉవాచ: తెలంగాణలో ఉన్నవారిని కూడా అరెస్టు చేస్తున్నారు. నల్గొండ, హైదరాబాదు నుంచి కూడా అరెస్టు చేసి తీసుకువస్తున్నారు
… ఇంతకూ జగన్ గారూ మీ ఉద్దేశం ఏమిటి? రాష్ట్రం సరిహద్దు దాటి బయట కూర్చుని రాష్ట్రంలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తూ ఉంటే.. తప్పుడు అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఉంటే వారిని వదిలిపెట్టేయాలా? పొరుగురాష్ట్రాల్లోని వారిని అరెస్టు చేయాలంటే.. ఆ రాష్ట్రాల ఎంబసీలను అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవాలా? ఈ దేశం మొత్తం ఒకటే.. నేరం చేసిన వాడు ఎక్కడున్నా అరెస్టు తప్పదు.. అనే కనీసస్పృహ.. ఒక టర్మ్  ముఖ్యమంత్రిగా కూడా చేసిన మీకు లేదా?

=) జగన్ ఉవాచ: ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. పోలీసులు ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేయకూడదు. ముందు 41ఏ నోటీసు ఇచ్చి విచారించాలి. అరెస్టు అవసరం తప్పదనిపిస్తే వారంటు ఇవ్వాలి. తర్వాత మేజిస్ట్రేటు అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాతే అరెస్టు చేయాలి.
… జగన్ గారూ అదుపులోకి తీసుకోవడానికి అరెస్టుకు మధ్య వ్యత్యాసం ఉన్నదనే సంగతి మీకు తెలుసా? వర్రా రవీందర్ రెడ్డి లాగా 41 ఏ నోటీసు ఇచ్చి వదిలేస్తున్న సందర్భాలు మీకు కనిపించడం లేదా? మీరు వేలమందితో నేరాలు చేయిస్తూ ఉంటే ప్రతిసారీ వారంటూ, మేజిస్ట్రేటు అనుమతీ సాధ్యమేనా? ఒకవేళ మీరు చెప్పిన నిబంధనలన్నీ నిజమైతే ప్రెస్ మీట్ లో గొల్లుమనడం ఎందుకు.? ఏకంగా కోర్టుకు వెళ్లండి. సుప్రీం తీర్పును ఉల్లంఘిస్తున్నారని కేసు వేయండి. ఏడేళ్లలోపు కేసుల్లో ఎట్టి పరిస్థితుల్లో అరెస్టులు జరగకుండా స్పష్టమైన  ఆదేశాలు కోర్టునుంచి తీసుకురండి.రోడ్డు మీద విలాపాలు ఎందుకు?

జగన్ మొత్తానికి తప్పులు చేస్తున్నవారిని అదుపులోకి తీసుకోవడం కూడా తప్పే అన్నట్టుగా చిత్రంగా మాట్లాడుతున్నారు. జగన్ కు నిజంగానే అరెస్టు అవుతున్న తమ సోషల్ మీడియా కార్యకర్తలమీద ప్రేమ ఉంటే.. తమ లీగల్ సెల్ వారితో హైకోర్టులోనే పిటిషన్ వేసి అసలు ఇలాంటి అరెస్టులు జరగకుండా స్పష్టమైన ఉత్తర్వులు తేవాలి. అలాంటి అరెస్టులు జరిగితే పోలీసులపై చర్యలుండేలా కోర్టును కోరాలి. అవేమీ చేయకుండా.. ఉబుసుపోని ప్రకటనలనతో.. అరెస్టు తర్వాత.. లీగల్ సెల్ ఆదుకుంటుంది అనే ముఖప్రీతి మాటలతో ప్రయోజనం లేదని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories