మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించి.. రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైపోతున్నారు. ‘సిద్ధం’ అనే పదాన్ని ఒక తారకమంత్రంలాగా ఈ ఎన్నికలకోసం తయారుచేసుకున్న జగన్మోహన్ రెడ్డి.. దానికి ముందు వెనుకలుగా పదాలు జోడించి ప్రచారపర్వంలో ముందుకెళ్తున్నారు. బస్సుయాత్ర కూడా ‘మేమంతా సిద్ధం’ అనే పేరుతోనే సాగబోతోంది. జగన్ 27వ తేదీ ఇడుపుల పాయ నుంచి యాత్ర ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తారు.
అయితే జగన్ బస్సులో రాబోతున్నారని అనగానే.. ప్రజల్లో రకరకాల సెటైర్లు పేలుతున్నాయి. రోడ్డు మార్గాన రాష్ట్రంలో తిరగడం జగన్ కు అలవాటు లేదు కదా.. అని జనం అంటున్నారు. తాడేపల్లి నుంచి తెనాలి రావాలన్నా కూడా హెలికాప్టర్లో రావడం మాత్రమే అయిదేళ్ల పాటూ అలవాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు పాపం బస్సెక్కి రావాలటే.. ఎన్ని ఇబ్బందులు ఉంటాయో కదా అనేది వారి సందేహం.
పైగా రాష్ట్రంలో ఉండే రహదారుల గురించి ఇంకా వెటకారాలు ఎక్కువ అవుతున్నాయి. ఆర్ అండ్ బీ పరిధిలోని గ్రామీణ రోడ్లు మాత్రమే కాదు.. స్టేట్ హైవేల్లో కూడా రెండడుగుల గోతులతో కూడా రోడ్లు అలరారుతున్నాయి. కొన్నేళ్లు రోడ్ల మరమ్మతుల గురించి జనం మొరపెట్టుకుంటున్నా.. జగన్ పట్టించుకోలేదు. అక్కడక్కడా మొక్కుబడిగా చేసిన హడావుడి దందా రిపేర్లు.. వారాల వ్యవధిలోనే లేచిపోయాయి. ఇలాంటి రోడ్లలో జగన్ ఎలా వస్తారబ్బా..? అనేది జనానికి ఇంకో సందేహం.
అన్నింటినీ మించిన వ్యవహారం మరొకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న అయిదేళ్లపాటూ కేవలం గాలిమార్గంలో మాత్రమే తిరుగుతూ వచ్చారు. అయితే సభలు, కార్యక్రమాలు నిర్వహించేప్పుడు కొన్నిచోట్ల హెలిపాడ్ నుంచి సభా వేదిక వరకు రోడ్లమీద ప్రయాణం చేయాల్సి వచ్చేది. అలాంటి సందర్భాల్లో జగన్ ‘వాహనాల్లో’ వెళ్లే రోడ్డు పొడవునా.. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు కట్టేవారు, పరదాలు కట్టేవారు, చెట్లను నరికించేవారు, దుకాణాలను మూయించేవారు, జైకొట్టడానికి డ్వాక్రా మహిళలు తప్ప జనాన్ని అనుమతించేవాళ్లు కాదు. ఇన్ని నిషేధాజ్ఞల మధ్య తిరిగిన జగన్ ఇప్పుడు బస్సు యాత్ర విషయంలో ఏం చేస్తారనేది ప్రజల సందేహం. ఊరికి పరదాలు కట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగన్, బస్సు యాత్ర సందర్భంగా కూడా పరదాలు కట్టాలా, బస్సు వచ్చే రోడ్లలో చెట్లను నరికించాలా అనేది అందరి సందేహంగా ఉంది. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.