తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్రస్థాయిలో కుదిపేస్తోంది. ఇప్పటికే అక్కడ ఒక డిఎస్పి అరెస్ట్ అయ్యారు. ఆయన ద్వారా అందిన సమాచారంతో మరో ఇద్దరు డిఎస్పీలు కూడా అరెస్టు అయ్యారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఓ ఎస్ డి ప్రభాకర్ రావు పాత్ర కీలకంగా ఉందనే సమాచారం బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన అమెరికాకు వెళ్ళిపోయి తలదాచుకుని ఉన్నారు.
రేవంత్ రెడ్డి సహా ప్రతిపక్ష నాయకులందరి ఫోన్లను టాపింగ్ చేయించిన వ్యవహారంలో రోజురోజుకు కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ పోలీసు అధికారులు అందరినీ వాడుకొని అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు టాపిక్ దురాగతానికి పాల్పడినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఫోన్ టాపింగ్ వివాదం తెరమీదకు వస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటలిజెన్స్ అధికారులను వాడుకుంటూ ప్రతిపక్ష నాయకుల ఫోన్ లను టాపింగ్ చేయిస్తున్నారని.. తెలుగుదేశం నాయకుడు మాజీ పోలీస్ అధికారి వర్ల రామయ్య ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
చూడబోతే ప్రతిపక్ష నాయకుల వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగట్టడం దగ్గర నుంచి, వారిని కట్టడి చేయడానికి తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనుసరించిన టాపింగ్ మార్గాన్ని, ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అయినట్లుగా మనకు కనిపిస్తోంది. చొరవ తీసుకుని దర్యాప్తు చేయిస్తే.. ట్యాపింగ్ నిజమేనని ఆధారాలతో సహా తేలితే గనుక అది చాలా పెద్ద నేరం అవుతుంది.
తెలంగాణలో కూడా టాపింగ్ చేసిన పోలీసు అధికారులు.. ప్రభుత్వం మారిన వెంటనే ఆ టాపింగ్ పరికరాలను, హార్డ్ డిస్కులను సమస్తం నాశనం చేసి తీసుకువెళ్లి అడవిలో పారేసినట్లుగా విచారణలో ఒప్పుకున్నారు. ఆ రాష్ట్రంలో ఈ వివాదం బయటికి వచ్చిన తర్వాత.. ఏపీలో టాపింగ్ కు పాల్పడుతున్న అధికారులు కూడా అలర్ట్ అయి ఉంటారనే అనుమానం కొందరిలో ఉంది. అంత ఈజీగా దొరికిపోకుండా ఈసరికే టాపింగ్ డివైజ్ లను నాశనం చేసి ఉండవచ్చునని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఫోన్ టాపింగ్ అనేది చాలా తీవ్రమైన నేరం కావడంతో.. అన్ని విషయాల్లోనూ కేసీఆర్‌ను అనుసరించి వ్యూహరచన చేసుకుంటూ ఉండే జగన్మోహన్ రెడ్డి.. ఏపీలో ప్రతిపక్ష నాయకుల పట్ల ఇలాంటి పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.