తత్వవేత్త జగన్ ఉవాచ: కేసులు అరెస్టులు మామూలే!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తత్వవేత్త అవతారం ఎత్తారు. వేదాంత సారాన్ని ఆయన తన పార్టీలో ముఖ్యులకు ప్రబోధిస్తున్నారు. రాజకీయం అన్న తరువాత.. అరెస్టులు, కేసులు చాలా మామూలు సంగతులు.. అరెస్టులు కానివాడు.. అసలు రాజకీయ నేత కానేరడు- అనే స్థాయిలో తన వారిని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి చేయగలిగింది ఇంకేమీ లేనప్పుడు.. చేసిన పాపాలు వదలకుండా వెన్నాడుతున్నప్పుడు.. మనిషి ఆశ్రయించగలిగిన అతిగొప్ప పలాయనమార్గం ఇలా వేదాంతం మాట్లాడడం మాత్రమే అని జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తున్నారు. జగన్ తాడేపల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలు చేశారు.  

చంద్రబాబు ప్రభుత్వం విఫలం అయిందని.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందని, ఇప్పుడు ఎన్నికలు వచ్చినా మనమే గెలుస్తామని, హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని.. ఈ పాచిపోయిన విమర్శలన్నీ రొటీన్! కానీ,  ఆయన పార్టీలో ఈ పీఏసీ కమిటీనే అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అని సర్టిఫై చేస్తూ ప్రకటించిన కమిటీలోని సుమారు నలభై మందిని ఉద్దేశించి చెప్పిన సంగతులు ఇంకో ఎత్తు. మీపై కేసులు పెట్టి అరెస్టు చేస్తే చేయనివ్వండి. అంతకుమించి వాళ్లేమీ చేయలేరు. నన్నూ 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ముఖ్యమంత్రిని కాగలిగాను. కేసులకు అరెస్టులకు  భయపడితే రాజకీయాలు చేయలేరు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అంటూ జగన్మోహన్ రెడ్డి తన పీఏసీ సభ్యులకు తత్వోపదేశం చేశారు.

మీమీద కేసులు పెడితే న్యాయపోరాటం చేద్దాం. సుప్రీం కోర్టు వరకైనా వెళదాం అని జగన్మోహన్ రెడ్డి వారికి ధైర్యం చెప్పారు. ఆయన మాటలను గమనిస్తే.. తమ పార్టీ నేతల మీద కేసులు పెట్టడం గ్యారంటీ అని.. ఆ కేసులకు వ్యతిరేకంగా తాము పోరాడినా సరే.. హైకోర్టు స్థాయిలో తమ వాదనలు వీగిపోతాయని.. శిక్షలే పడతాయని.. సుప్రీంను ఆశ్రయించడం ద్వారా.. మరికొంత కాలయాపన చేయడం.. శిక్షలు అనుభవించే పరిస్థితి రాకుండా రోజులు నెట్టుకురావడం మాత్రమే తమ ముందున్న గత్యంతరం అని ఫిక్సయిపోయినట్టుగా కనిపిస్తోంది.
పీఎస్సార్ ఆంజనేయులును అరెస్టు చేయడం పట్ల జగన్ మాటల్లో స్పష్టంగా ఆందోళన వ్యక్తం కావడం గమనార్హం. మిధున్ రెడ్డి ని అనవసరంగా ఇరికిస్తున్నారని జగన్ పాపం ఆవేదన చెందుతున్నారు. మొత్తానికి తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలన్నీ వదిలిపెట్టేవి కాదని అర్థమైనట్టుందని.. అందుకే ఆయన తత్వవేత్త అవతారం ఎత్తి వేదాంతం బోధిస్తున్నారని జనం నవ్వుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories