సింపుల్ గా తేల్చేశారు. అంతా అయిపోయింది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల నుంచి రేషన్ బియ్యాన్ని స్మగ్లింగుకు తరలించిన కేసుల్లో బలిపశువులు ఆశ్రితులే అయ్యారు. పెద్దతలకాయలు సేఫ్ జోన్ చూసుకున్నాయి. తమను ఆశ్రయించిన భృత్యులు, తమను నమ్మిన వారిని నట్టేట ముంచేసి.. జైళ్లకు పంపడానికి పేర్ని కుటుంబం వెనుకాడడం లేదు. ప్రస్తుతం… నాని భార్య జయసుధ పోలీసు విచారణకు హాజరై, అక్కడ వెల్లడించిన విషయాలను గమనిస్తే ఎవ్వరికైనా సరే ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. గోడౌను తన పేరిట ఉన్నదే తప్ప.. అక్కడి వ్యాపారంతో గానీ, వ్యవహారంతో గానీ తనకేమాత్రం సంబంధం లేనేలేదని, అంతా మేనేజరు మానస్ తేజ్ చూసుకుంటారని జయసుధ పోలీసులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. దానికి తగ్గట్టుగా మానస్ తేజ్ బ్యాంకు అకౌంట్లోకి లక్షల్లో లావాదేవీలు జరిగి ఉండడం కూడా కలపిచూస్తే.. మేనేజరే ఇరుక్కుంటారని.. అసలు యజమానులు ఇబ్బంది లేకుండా ఉంటారనే అభిప్రాయం అందరికీ కలుగుతోంది.
దాదాపు నెలరోజుల పాటు కొనసాగిన హైడ్రామా.. పరారీలోకి వెళ్లిన జీవితం తరువాత.. పేర్ని నాని భార్య జయసుధకు కోర్టు ముందస్తు బెయిలు ఇచ్చింది. అది కవచంలాగా దొరికిన తర్వాతనే ఆమె బాహ్యప్రపంచంలోకి వచ్చారు. పోలీసుల విచారణకు సహకరించాల్సిందే అని కోర్టు కూడా ఆదేశించింది కాబట్టి.. ఆమె పోలీసు స్టేషనుకు వచ్చారు. రాష్ట్రంలో అధికారం చేతులు మారిన తర్వాత.. విచారణలు ఎదుర్కొంటున్న ప్రతి వైసీపీ నాయకుడూ ఏం చెబుతున్నారో.. జయసుధ కూడా అదే చెప్పారు. తనకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా.. కాదు, లేదు వంటి సమాధానాలతో చాలా ప్రశ్నలకు దాటవేయాలని చూశారు. విచారణాధికారి ఆమెకు మొత్తం 45 ప్శ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ విచారణ పర్వంలో కీలకాంశం ఏమిటంటే.. జరిగిన తప్పిదాన్ని పూర్తిగా తమ గోడౌను మేనేజరు మానస్ తేజ్ మీదికి నెట్టివేయడం. అతని ఖాతాలోకి ఆర్థిక లావాదేవీలు జరిగిఉండవచ్చు గాక.. కానీ.. అంతమాత్రాన అతడినే అంతిమ లబ్ధిదారుగా అభివర్ణించడం కామెడీ అవుతుంది. మానస్ తేజ్ అకౌంట్ నుంచి, జయసుధకు గానీ, నానికి గానీ.. నేరుగా బ్యాంకు ట్రాన్స్ ఫర్ లు జరిగి ఉండకపోచ్చు. కానీ ప్రయోజనం పొందింది.. జరిగిన బియ్యం మాయం వ్యవహారాలకు మార్గదర్శకత్వం వహించింది వారేనని పసిపిల్లల్ని అడిగినా చెబుతారు.
అంతా మేనేజరు మీదకు నెట్టేస్తే.. ఆ పాపాన్ని మోస్తున్నందుకు మానస్ తేజ్ కు భారీగానే ముట్టజెప్పి ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. నేరం తాము చేస్తే శిక్ష మాత్రం.. తమను నమ్మిన ఆశ్రితులకు పడేలా వ్యూహరచన చేయడం పేర్ని నాని కుటుంబానికే చెల్లిన విద్య అని అంతా అనుకుంటున్నారు.