పెద్దిరెడ్డి భూదాహానికి కలెక్టర్లూ ఇరుక్కుంటున్నారు!

జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో నెంబర్ టు గా చలామణి అయిన కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద రోజు రోజుకు ఆరోపణలు వెల్లువలా వస్తున్నాయి. వందల వేల ఎకరాల ప్రభుత్వ భూములను పెద్దిరెడ్డి కబ్జా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా పరిణామం ఏంటంటే పెద్దిరెడ్డి భూదాహానికి వందల ఎకరాలను ధారాదత్తం చేసిన  వ్యవహారాలలో.. అప్పటి ఐఏఎస్ అధికారులు కూడా ఇరుక్కుంటున్నారు. పెద్దిరెడ్డి బాగోతాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో కేసులు బనాయించి చర్యలు తీసుకోవడం అంటూ జరిగితే కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీవోలు అందరూ కూడా కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుందని అభిప్రాయాలు ప్రజల్లో ఏర్పడుతున్నాయి.

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లి లో వంద కోట్లకు పైగా విలువైన దాదాపు 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూములుగా మార్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకు కట్టబెట్టారనేది ఇప్పుడు హాట్ న్యూస్ గా వార్తల్లోకి వస్తోంది. ఈ వ్యవహారంలో అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రస్తుతం తిరుపతి కలెక్టర్ గా ఉన్న ఎస్ వెంకటేశ్వర్- పెద్దిరెడ్డి కుట్రకు తోడ్పాటు అందించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. పలమనేరు, పుంగనూరు ఆర్డిఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డి కూడా ఈ కుట్ర వెనుక ఉన్నట్లుగా తేల్చారు. వీరితోపాటు అప్పటి పలమనేరు తహసిల్దార్ సీతారాం కూడా లబ్ధిదారులతో కుమ్మక్కైనట్లుగా ఈ విభాగం గుర్తించింది.

వీరంతా కూడా నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడి ప్రభుత్వ భూముల మ్యుటేషన్లో అక్రమాలు చేసినట్లుగా నిర్ధారించారు. భూకబ్జా చట్టాల్లోని అక్రమ చొరబాటు, మోసం, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద వీరందరి మీద కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీల రూపేణా వివిధ వ్యక్తుల పరం అయిన 982 ఎకరాలను తిరిగి ప్రభుత్వానికి చెందేలా చర్యలు తీసుకోవాలని ఈ కుంభకోణం లో ప్రాథమిక దర్యాప్తు జరిపిన విజిలెన్స్ ప్రభుత్వానికి సూచించడం విశేషం.

అధికార పార్టీ నాయకులతో అంటకాగుతూ చెలరేగిపోయినందుకు కలెక్టర్ స్థాయి ఐఏఎస్ అధికారులు కూడా ఇప్పుడు కటకటాలు లెక్క పెట్టాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. జీహుజూర్ అనడంలో హద్దు మీరి ప్రవర్తిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎవరైనా గ్రహించాలి. మొత్తానికి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి భూదాహం అనేది ఇప్పుడు ఆయన బినామీలుగా ఆ ఆస్తులను తమ పేరిట పెట్టుకున్న వారిని మాత్రమే కాదు అధికారులను కూడా నేరస్తులుగా మార్చి వేస్తున్నది.

Related Posts

Comments

spot_img

Recent Stories