వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి అరాచకత్వానికి అలవాటుపడ్డారో అర్థం చేసుకోవడానికి ఇది మరొక ఉదాహరణ! నిబంధనలు అంటూ ఉంటే వాటిని ఉల్లంఘిస్తే తప్ప తాము గొప్పవాళ్ళం కాదు అనే దురభిప్రాయంతో వారు చెలరేగుతూ ఉంటారో ఏమో తెలియదు. వారి ప్రవర్తన మాత్రం అలాగే ఉంటోంది. ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవస్థలన్నింటినీ సర్వ నాశనం చేస్తూ, చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా అతిక్రమిస్తూ చెలరేగిపోయిన ఆయన అనుచర గణాలు ఓడిపోయిన తర్వాత కూడా బుద్ధి మార్చుకోవడానికి సిద్ధపడటం లేదు! మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల ఆలయంలోకి ప్రవేశించే విషయంలో నిబంధనలను ఉల్లంఘించి ఆలయానికి రావడం, అధికారులు ఉపేక్ష వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చేటప్పుడు వస్త్రధారణలో రాజకీయ పార్టీల చిహ్నాలు జెండాలు, స్టిక్కర్లు, చిహ్నాలు ఉండరాదని తిరుమల తిరుపతి దేవస్థానాల నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అలాంటివి అనుమతిస్తే రాజకీయ వ్యవహారాల అరాచకత్వం తిరుమల ఆలయంలో వాతావరణాన్ని నాశనం చేస్తుందనేది ఈ నిబంధన విధించడం వెనుక ఉన్న ఆలోచన. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు- తిరుమలేశుని దర్శనానికి వచ్చారు. ఆయన తన చొక్కా మీద వైయస్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ ధరించి వచ్చారు. ఈ జగన్ స్టిక్కర్ వేసుకుని తిరగడం అనేది ఎన్నికల సమయంలో ప్రచారం కోసం వేసిన వేషాలు! అదే మాదిరిగా ప్రచారానికి వచ్చినట్టుగా ఆయన తిరుమల రావడం గమనార్హం. తిరుమల క్షేత్రంలో ఎలాంటి రాజకీయ ఆనవాళ్లు కూడా ఉండరాదు అనేది నిబంధన కాగా, వీటిని ఉద్దేశపూర్వకంగా అతిక్రమించిన అంబటి రాంబాబుకు అసలు బుద్ధుందా అని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులైన బిజెపి నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
టీటీడీ నిర్వహణలో కొన్ని నిబంధనలు ఉంటే వాటిని ఉల్లంఘించడమే తమ పని అన్నట్లుగా అంబటి వ్యవహరించారా అనిపిస్తుంది. వైసీపీ నాయకులంతా ఇలా కంకణం కట్టుకున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. నాన్ హిందూ కనుక జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పై సంతకం పెడితే తప్ప తిరుమల రావడానికి వీల్లేదని నిబంధనలను గుర్తు చేసినందుకు.. హిందువులైన తాము ఇతర నిబంధనలను అతిక్రమించి తిరుమలకు వస్తాం అని వారు సంకేతాలు పంపుతున్నట్లుగా ఈ పెడపోకడ కనిపిస్తోంది. అయితే అంబటి రాంబాబు ఈతరహాలో రాజకీయ చిహ్నాలతో జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ తో తిరుమలకు వచ్చినప్పుడు అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న కూడా వ్యక్తం అవుతుంది.