డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆవేశంతో అంతుచూస్తాం అని నిప్పులు చెరగడం మాత్రమే కాదు.. పరిస్థితులు ఇలా ఉండవని హెచ్చరించడం మాత్రమే కాదు.. తప్పులు చేసే వారిని తన సొంత తమ్ముళ్లలా భావిస్తూ వారికి బుద్ధిమాటలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తెలిసో తెలియకో ఒక ఉన్మాదంలో ఉండిపోయి.. వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు అనే ట్యాగ్ లైన్ తగిలించుకుని.. విచ్చలవిడిగా రెచ్చిపోతున్న వారికి.. తద్వారా పోలీసు కేసుల్లో ఇరుక్కుని తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న వారికి సరైన దారిలో ఉండమని మంచి మాటలు కూడా చెబుతున్నారు. మాట కటువుగానే చెప్పి ఉండొచ్చుగానీ.. పవన్ కల్యాణ్ చెప్పినది మాత్రం మంచి మాట.
సోషల్ మీడియా వేదికల మీద ఎవరినైనా దూషించే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలని, లేదంటే కర్మ వదిలిపెట్టదని ఆయన తాత్విక చింతనతో వారిని హెచ్చరిస్తున్నారు.
‘‘నిర్మాణాత్మక విమర్శలు ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం. దూషించడం, హత్యలు, అత్యాచార బెదిరింపులు సరికాదు. ప్రజాస్వామ్యంలో మనమంతా వివిధ అంశాలపై విభేదించవచ్చు. అసమ్మతి వ్యక్తం చేయవచ్చు. కానీ ఇది విధానాల వరకే పరిమితం కావాలి తప్ప వ్యక్తిగతం కాకూడదు. ఇందులోకి కుటుంబాలు, వ్యక్తులను లాగడం.. కులదూషణలు ఎదుటి వ్యక్తుల విశ్వాసాలను దెబ్బతీయడం.. దేవుళ్లపై దాడిచేసేలా ఉండొద్దు. కండబలం, ధనబలం, క్రిమినల్ గ్యాంగులతో కలిసి ఈ దేశంలోని సగటు భారతీయుడిని బెదిరించలేరు. అందువల్ల క్రిమినల్ ముఠాలు, గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఒక్కటే చెబుతున్నా.. ‘దూషించే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకోండి.. కర్మ వదిలిపెట్టదు’ అని పవన్ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
నిర్మాణాత్మక విమర్శలు చేసే హక్కు అందరికీ ఉంది. అలాంటి విమర్శలు తప్పకుండా చేయండి అంటూ పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రత్యర్థులకు కూడా పిలుపు ఇవ్వడం విశేషం. కానీ.. విమర్శల్లో ఒకరి ప్రభావానికి లోనై తప్పుడు మార్గాలు తొక్కవద్దు అని ఆయన చెబుతున్నారు. అయినా.. ‘పోగాలము దాపురించిన వారికి హితవాక్యములు చెవినికెక్కవు కదా..’ అని సూక్తి. మరి పవన్ మాటలను వైసీపీ దళాలు ఎలా అర్థం చేసుకుంటాయో చూడాలి.