పవన్ తాజా నిర్ణయం.. జనసైనికులకు ఫుల్ జోష్!

జనసేనాని పవన్ కల్యాణ్.. తాను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయబోతున్నట్టు ప్రకటించిన తర్వాత కూడా.. చిన్న సందిగ్ధానికి అవకాశం వదలిపెట్టారు. ఎంపీగా పోటీచేయమని అడుగుతున్నారు గానీ.. ఇంకా నిర్ణయించుకోలేదు ఆలోచిస్తున్నాను- అని ఆయన చెప్పారు. అయతే, తాజాగా తాను ఎంపీ బరిలో నిలవకుండా, కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే బరిలో ఉండాలని పవన్ నిర్ణయించారు. నిజానికి పవన్ నిర్ణయం విపక్ష ఎన్డీయే కూటమికి కొత్త జోష్ ఇస్తోంది. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే బరిలోనే ఉండడం వలన రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులకు ఫుల్ జోష్ వస్తోంది. మరింతగా ఇనుమడించిన ఉత్సాహంతో వారు పార్టీకోసం, కూటమి విజయం కోసం పనిచేసేందుకు ఉద్యుక్తులు అవుతున్నారు.

పవన్ కల్యాణ్ ను ఎంపీగా పోటీచేయాల్సిందిగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దలు అడిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంపీగా గెలిచి వస్తే కేంద్రమంత్రిని చేస్తాం అంటూ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఆ నేపథ్యంలో పవన్ కాస్త డోలాయమాన స్థితిలో పడ్డారు. పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థుల రెండు జాబితాలను ప్రకటించినా.. తన పేరును చెప్పలేదు. ఆ తర్వాత.. పిఠాపురం నుంచి పోటీచేస్తాను గానీ.. ఎంపీగా పోటీచేసే విషయం తేల్చుకోలేదని అన్నారు. అయితే ఆ విషయంలో కూడా సందిగ్ధానికి తెరదించేస్తూ తాజాగా మంగళవారం నాడు నిర్ణయం ప్రకటించారు.

తనకోసం ఎన్నో త్యాగాలు చేసిన తంగెళ్ల ఉదయ్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఆయన ఎంపిక చేశారు.
పవన్ కల్యాణ్ ఎంపీ బరిలో కూడా పోటీచేస్తే.. ఆ పరిస్థితిని ఎడ్వాంటేజీగా వాడుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహకర్తలు, సోషల్ మీడియా దళాలు ఎదురుచూస్తూ గడిపాయి. పవన్ కు అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి నెగ్గుతుందనే నమ్మకం లేదని, అందుకే ఆయన తన సేఫ్టీ చూసుకుని ఎంపీగా పోటీచేస్తున్నారని విమర్శల జడివాన కురిపించడానికి అంతా రెడీ అయిపోయారు. అయితే వైసీపీ కుట్రపూరిత ప్రచారాలను ముందే పసిగట్టిన పవన్ కల్యాణ్ సబబైన నిర్ణయం తీసుకున్నారు.

తాను కేవలం ఎమ్మెల్యే బరిలో మాత్రమే ఉంటానని స్పష్టం చేయడం ద్వారా.. రాష్ట్ర అసెంబ్లీని కూటమి గెలిచి తీరుతుందనే విశ్వాసాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తం చేసినట్లు అయింది. ఇది.. రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీ దళాలకు స్ఫూర్తినిచ్చే వ్యవహారం అవుతుంది కూడా

Related Posts

Comments

spot_img

Recent Stories