పవన్ నిర్ణయం జనసైనికులు అందరికీ స్ఫూర్తి!

జనసేనాని పవన్ కళ్యాణ్..  తాను ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.  కొన్ని రోజులుగా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు,  ఏ సభకు పోటీ చేస్తారు అనే విషయంపై చర్చలు సాగుతూ ఉండగా.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు.  తాను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.  ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.  పవన్ కళ్యాణ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోనే ఉండడం అనేది..  ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జన సైనికులకు స్ఫూర్తినిచ్చే అంశంగా నిలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే అభిప్రాయమే పార్టీలో అందరికీ ఉండేది.  అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తులను తుది దశకు తీసుకురావడానికి ఢిల్లీకి వెళ్లి అమిత్ షా ప్రభృతులతో చర్చలు జరిపిన నేపథ్యంలో..  కొత్త అంశం తెరమీదకు వచ్చింది.  పవన్ కళ్యాణ్ ను ఎంపీగా పోటీ చేయాల్సిందిగా అమిత్ షా సూచించినట్లుగాను,  ఎంపీగా గెలిచి వస్తే తప్పకుండా కేంద్రమంత్రి పదవి కట్టబెట్టి సముచితంగా గౌరవిస్తామని హామీ ఇచ్చినట్లుగాను ప్రచారం జరిగింది. సీట్ల సర్దుబాటు చర్చలలో పవన్ కళ్యాణ్ మూడు అసెంబ్లీ సీట్లను ఒక ఎంపీ సీట్లు కూడా త్యాగం చేశారు.  అంతిమంగా మిగిలిన రెండు ఎంపీ నియోజకవర్గాలలో..  కాకినాడ నుంచి పవన్ బరిలో ఉంటారని విస్తృతంగా వినిపించింది.  మరొకవైపు పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగాను,  అలాగే పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గాను కూడా  బరిలో ఉంటారని కూడా గుసగుసలు వచ్చాయి. 

 ఈ విషయంలో  సస్పెన్స్కు తరలించుతూ పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు.  ఎంపీ బరిలో నిలవబోయేది లేదని తేలు చేశారు.  ఆయనను తొలిసారిగా శాసనసభకు పంపించే అవకాశం పిఠాపురం నియోజకవర్గానికి దక్కినట్లుగా అయింది.  అయితే ఈ నిర్ణయం ద్వారా..  రాష్ట్రవ్యాప్తంగా జనసైనికుల్లో పవన్ ఒక స్ఫూర్తిని నింపారని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 ఎందుకంటే,  పవన్ కళ్యాణ్ కేవలం ఎంపీ బరిలో మాత్రమే నిలిచి ఉంటే..  ప్రత్యర్థులు తీవ్రమైన విమర్శలు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లుగా ఉండేది.  అసెంబ్లీ బరిలో విపక్ష కూటమి గెలిచే అవకాశం లేదు గనుక,  ఓటమి భయంతో పవన్ ఎంపీగా పోటీ చేస్తున్నారని ప్రత్యర్ధులు ఒక విషపు ప్రచారం సాగించేవారు.  అలాంటి దుష్ప్రచారాలుకు అవకాశం లేకుండా పవన్ కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే ఇతర అభ్యర్థులకు,  ఆయన కూడా తమతో పాటు ఉండటం అనేది గొప్ప నైతిక బలాన్ని అందిస్తుంది. . అలాగే ఎన్నికల సమరాంగణంలో జనసైనికులు అందరికీ కూడా ఉత్సాహాన్నిస్తుంది అని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories