పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన హరిహర వీరమల్లు ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయినా, ఆయనపై అభిమానుల క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం అందరి దృష్టి ఆయన నటిస్తున్న తదుపరి చిత్రం ఓజీపై ఉంది. ప్రత్యేకంగా సెప్టెంబర్ 2న పవన్ జన్మదినం కావడంతో, ఆ రోజున ఏవైనా కొత్త అప్‌డేట్లు వస్తాయా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవల టాలీవుడ్‌లో పాత హిట్ సినిమాలను మళ్లీ థియేటర్లలోకి తెచ్చే ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ నటించిన తమ్ముడు సినిమాను బర్త్‌డే స్పెషల్‌గా తిరిగి విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌గా ఆయన కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన జల్సా సినిమాను కూడా మళ్లీ పెద్ద తెరపై చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేసిన జల్సా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఆ హిట్ జ్ఞాపకాలను మళ్లీ అభిమానులు ఆస్వాదించేందుకు, సెప్టెంబర్ 2న ఈ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.