జనసేన అధినాయకుడిగా ఇదివరకటి పరిస్థితి వేరు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలతో సతమతం అవుతున్న పరిస్థితి వేరు. అయినా సరే.. ఒత్తిడి మధ్యలోనే తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు ఒక గొప్ప హామీ ఇచ్చారు. ఆచరణలో ఇది చాలా కష్టసాధ్యమే అయినప్పటికీ.. ఆయన తన సమయాన్ని సర్దుబాటు చేసుకోని ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఉద్దేశంతో ఉన్నారు. పవన్ కల్యాణ్ మాట పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
విశాఖలో ‘సేనతో సేనాని’ పేరుతో నిర్వహిస్తున్న మూడురోజుల కార్యక్రమాల్లో రెండోరోజున పార్టీ శ్రేణులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఉందన్న ఆకాంక్షను పవన్ కల్యాణ్ వ్యక్తం చేశారు. కారణాలు ఏమైనప్పటికీ.. సంస్థాగతంగా జనసేన బలహీనంగా ఉన్నదనే విషయాన్ని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నారు. అదే సమయంలో.. 2026 మార్చి 14న జరిగే పార్టీ ఆవిర్భావ సభ పూర్తి సంస్థాగత బలంతో చేయాలని ఉందని లక్ష్యం నిర్దేశించుకున్నారు. దానికి తగ్గట్టుగా అక్టోబరు నుంచి ప్రతినెలా పార్టీకోసం 10 రోజుల సమయం కేటాయించబోతున్నట్టు పవన్ చెప్పారు. ఆ పదిరోజులు కార్యకర్తలతో భేటీ అవుతూ పార్టీ నిర్మాణంపై దృష్టిపెడతానని అన్నారు.
ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ.. పవన్ కల్యాణ్ పార్టీ కోసం ఒక నెలలో పదిరోజులు కేటాయించడం అనేది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. పరిపాలనలో పవన్ కల్యాణ్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏదో యథాలాపంగా మంత్రి పదవి నిర్వహించడం కాకుండా, ప్తరి విషయాన్ని కూలంకషంగా తెలుసుకుని, బోధపరచుకుని.. విషయం అర్థం చేసుకున్న తర్వాతనే ముందడుగు వేస్తూ.. మంత్రి పదవికి తగ్గట్టుగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ పవన్ కల్యాణ్ సాగుతున్నారు. ఆ పరిపాలన బాధ్యతలకు తోడు.. సినిమాల పనులు కూడా ఉండనే ఉన్నాయి.
ఎటూ పార్టీ కోసమే తాను సినిమాలు చేస్తున్నట్టుగా విశాఖ సభల్లోనే పవన్ కల్యాణ్ మరోమారు స్పష్టం చేశారు. ఈ సినిమాలు కూడా ఆయన సమయాన్ని చాలా వరకు హరించే అవకాశం ఉంది. ఇన్ని ఒత్తిడుల మధ్య పవన్ కల్యాణ్ పార్టీకోసం నెలకు పదిరోజుల సమయం కేటాయించడం అనేది చాలా పెద్ద విషయమే. తమ సేనాని.. నెలకు పదిరోజులు ఇవ్వకపోయినా పర్లేదు.. కానీ, సంస్థాగత నిర్మాణంపై చురుగ్గా దృష్టిపెట్టదలచుకోవడమే పార్టీకి పెద్ద ఎడ్వాంటేజీ అని కార్యకర్తలు సంతోషిస్తున్నారు. ఆయన అన్నట్టుగా వచ్చే ఏడాది ఆవిర్భావ దినోత్సవం నాటికి పార్టీ పూర్తిస్థాయిలో సంస్థాగతంగా బలపేతం కాగలిగితే.. భవిష్యత్తులో రాజకీంగా విస్తరించడానికి, మరింత మందికి మరిన్ని అవకాశాలు దక్కడానికి కూడా వీలవుతుందని కార్యకర్తలు ఆశిస్తున్నారు.