కాకినాడ పోర్టు కేంద్రబిందువుగా జరుగుతున్న పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ విషయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నెక్ట్స్ ఫేజ్ కార్యాచరణకు వెళుతున్నారు. అక్రమార్కుల స్మగ్లర్ల అంతు తేల్చడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఉండవిల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో ప్రత్యేకంగా భేటీ అయిన పవన్ కల్యాణ్.. తాను స్వయంగా సముద్రం మీదకు వెళ్లి పరిశీలించినప్పుడు గమనించిన విషయాలు, అక్కడ స్మగ్లింగ్ దందా జరుగుతున్న తీరును మొత్తం సీఎంకు వివరించారు. ఈ బియ్యం మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సి ఉన్నదని చర్చించారు.
చూడబోతే.. త్వరలోనే బియ్యం స్మగ్లర్ల ఆట కట్టించడానికి కఠిన చర్యలు ఉంటాయని అనిపిస్తోంది. గత మూడేళ్లలో ఒక్క కాకినాడ పోర్టునుంచే 48వేల కోట్లకు పైగా బియ్యం ఎగుమతి కావడం అనేది మాఫియా విపరీత ధోరణికి నిదర్శనం అంటూ పవన్, చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. అయిదేళ్లుగా కాకినాడ పోర్టులోకి ఎవ్వరినీ అడుగుపెట్టనివ్వకుండా ఎలాంటి విచ్చలవిడితనం సాగుతున్నదో తెలియజెప్పారు.
పవన్ కల్యాణ్ కాకినాడ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారాన్ని, పోర్టు అధికారులు తనను కూడా అనుమతించకుండా చూపించిన పెడసరం ధోరణుల్ని ఒకపట్టాన విడిచిపెట్టేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఈ స్మగ్లింగ్ దందాపై చర్యలు తీసుకోవడం గురించి.. సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టే.. కేంద్రమంత్రి అమిత్ షాను కలవడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా మంగళగిరి వర్గాలు తెలియజేస్తున్నాయి. త్వరలోనే కేంద్ర హోం మంత్రిని కలిసి కాకినాడ పోర్టు నిర్వహణలో రహస్యాలకు ప్రాధాన్యం ఇస్తున్న తీరు, ఆ పోర్టు వల్ల దేశభద్రతకే ముప్పు వాటిల్లగల ప్రమాదాల గురించి.. షా కు చెప్పబోతున్నారని సమాచారం. ఈ విషయంలో ఆలస్యం చేసే ఉద్దేశంలేదని, ఒకవేళ అమిత్ షా తో అపాయింట్మెంట్ ఆలస్యం అయ్యేట్లయితే.. లేఖ ద్వారానైనా కాకినాడ పోర్టు దురాగతాలను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లి వారి ఆట కట్టించాలని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.