తిరుపతి అసంతృప్తులను సెట్ చేసేసిన పవన్!

జనసేనకు దక్కిన 21 ఎమ్మెల్యే స్థానాల్లో తిరుపతి నియోజకవర్గంలోని స్థానిక నేతల అసంతృప్తి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. పొత్తుల్లో తిరుపతి సీటు తీసుకున్న జనసేనాని.. పలుదఫాలుగా అక్కడ సర్వేలు నిర్వహించిన తర్వాత.. విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో చిత్తూరు సిటింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే.. ఆరణి ఎంపిక తిరుపతి జనసేనలో ప్రకంపను పుట్టించింది. ఆరణి గోబ్యాక్ అంటూ ఫ్లెక్సిలు వెలిశాయి. ఆయనకు సహకరించేది లేదని స్థానికనేతలు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. చివరికి స్వయంగా తిరుపతికి వచ్చి అక్కడి నాయకులు అందరితోనూ సమావేశమైన పవన్ కల్యాణ్.. అసంతృప్తులందరినీ బుజ్జగించి ఆరణి విజయం కోసం పనిచేసేలా ఒక్కతాటిమీదకు తెచ్చేశారు.


పవన్ కల్యాణ్ తన రాజకీయ అనుభవాన్ని, తెలివితేటలను తిరుపతి నియోజకవర్గం బుజ్జగింపుల విషయంలో నిరూపించుకున్నారని సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఎన్నికల సమయంలో ఇలాంటి అసంతృప్తులు ప్రతి నియోజకవర్గంలోనూ వ్యక్తం అవుతూ ఉండడం చాలా సహజం. ఇలాంటి పరిస్థితి దాదాపుగా అన్ని పార్టీల్లోనూ ఉంటుంది. పార్టీ అధినేతలు తమ నివాసాలకు అసంతృప్త నేతల్ని పిలిపించుకుని వారిని ఊరడిస్తుంటారు. కానీ.. పవన్ కల్యాణ్ తిరుపతి విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.


శుక్రవారం నాడు ఉండవిల్లిలోని చంద్రబాబునాయుడు నివాసంలో మూడు పార్టీల నాయకుల కీలక భేటీ జరిగింది. సీట్లపంపకాల్లో ఉండే చిన్న చిన్న చికాకుల గురించి నేతలు చర్చించుకున్నారు. పునఃపంపంకం గురించి కూడా మాట్లాడుకున్నారు. ఆ భేటీ ముగిసిన వెంటనే.. పవన్ కల్యాణ్ నేరుగా తిరుపతికి వచ్చేశారు. స్థానికంగా ఉన్న పార్టీ నాయకులందరితోనూ విడివిడిగానూ, ఉమ్మడిగానూ సమావేశం అయ్యారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను కూడా పిలిపించి మాట్లాడారు. తిరుపతిలో వైసీపీని ఓడించి తీరాలని.. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే.. పార్టీని నమ్ముకుని ఉన్న వారందరికీ తగిన న్యాయం చేస్తామని పవన్ వారికి హామీ ఇచ్చారు.


అంతా ముగిసిన తరవాత.. అక్కడ పార్టీలో ఇన్నాళ్లూ అసంతృప్త వర్గానికి నాయకత్వం వహించిన కిరణ్ రాయల్ మీడియాతో.. పవన్ కల్యాణ్ తనను కుటుంబసభ్యుడిగా భావిస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు అందరమూ ఆరణి శ్రీనివాసులు విజయానికి పనిచేస్తామని చెప్పడం విశేషం. తిరుపతిలో జనసేన పార్టీలో చీలిక తీసుకురావడం ద్వారా కాపు ఓటుబ్యాంకును చీల్చి లబ్ధిపొందాలని వైసీపీ వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. అయితే.. పవన్ స్వయంగా వచ్చి సర్దిచెప్పడంతో జనసేన, తెలుగుదేశం, బిజెపి శ్రేణులన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇది పార్టీ అభ్యర్థికి శుభపరిణామం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories