ఇది ఎన్నికల సీజను. నియోజకవర్గంలోని అనేక గ్రామాల ప్రజలు తరలివచ్చి తమ పార్టీల్లోకి చేరుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకోవడం అనేది రాజకీయ పార్టీలకు సర్వసాధారణమైన సంగతి. ఊరూపేరూ లేని వారిని కొంతమందిని పోగేసి.. వారికి రింగులీడరులాగా ఒకరిని పురమాయించి.. వారందరికీ వరుసగా పార్టీ కండువాలు కప్పేసి.. పదికి వందగా లెక్కలు చెబుతూ.. వారంతా వచ్చి తమ పార్టీలో చేరుతున్నారని.. డప్పు కొట్టుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటు. ప్రత్యేకించి.. ప్రచారపర్వం ముమ్మరం అయ్యేకొద్దీ.. నియోజకవర్గాల్లో ఫేక్ చేరికలు వందల సంఖ్యలో జరుగుతూ ఉంటాయి. అలాంటిది ప్రజల్లో అంతో ఇంతో గుర్తింపు ఉన్న వ్యక్తి, రాజకీయ ప్రాధాన్యం ఉన్న కుటుంబానికి చెందిన వారసురాలు తనంతగా తరలి వచ్చి పార్టీలో చేరుతానని అంటే.. వద్దనే వారుంటారా? వద్దని అనడం మాత్రమే కాదు.. ఎందుకు వద్దంటున్నాననే విషయంలో సహేతుకమైన కారణాలు చెప్పి.. ప్రజల మనసు గెలవగల వారు ఉంటారా? ఆ పని జనసేనాని పవన్ కల్యాణ్ చేశారు. ఆ రకంగా ఆయన తన మానవీయతను, కుటుంబ బంధాల పట్ల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని చాటుకున్నారు.
విషయంలోకి వెళితే..
కాపు కులమే తన ప్రాతిపదికగా రాజకీయం చేస్తూ ఉండే సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలోకి చేరడానికి ఊగిసలాడి ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వైసీపీలో తనకు పెద్దపీట వేస్తారని ఆయన ఆశించారు గానీ.. అక్కడ అంత సీన్ దక్కలేదు. కాకపోతే.. మరీ లూప్ లైన్ లో పడిపోకుండా.. కొన్ని ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి పవన్ కల్యాణ్ ను తిట్టడానికి మాత్రం ఆయన పరిమితం అవుతున్నారు. పిఠాపురంలో పవన్ ను ఓడించి తీరుతానని భీషణమైన ప్రతిజ్ఞ కూడా చేశారు.
అయితే ఆయన తీరుకు సొంత కుటుంబంలో ప్రతిఘటన ఎదురైంది. ఆయన కూతురు క్రాంతి, తన తండ్రి ధోరణిని తప్పుపట్టారు. జగన్ తన తండ్రిని పవన్ ను తిట్టడానికి మాత్రమే వాడుకుంటున్నారని, ఆ సంగతి ఆయనఅర్థం చేసుకోవడం లేదని, తాము పిఠాపురంలో పవన్ను గెలిపించడానికి పనిచేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో తండ్రీకూతుళ్ల మధ్య మాటామాటా నడిచింది.
తాజాగా ముద్రగడ కూతురు క్రాంతి, తన భర్త చందుతో కలిసి పవన్ కల్యాణ్ వద్దకు వచ్చి.. తాము జనసేన పార్టీలో చేరుతాం అని అడిగారు. అయితే వారి ప్రతిపాదనను పవన్ సున్నితంగా తిరస్కరిస్తూ.. తాను మూడు పార్టీలనే కలపడానికి ప్రయత్నించిన వ్యక్తిని అని.. అలాంటిది ముద్రగడ కుటుంబాన్ని వేరు చేస్తానా అంటూ ప్రశ్నించారు. నన్ను ఎందరో తిట్టారు. పెద్దలు ఎందరు తిట్టినా భరిస్తాను. ఎదురు తిట్టను.. అని ముద్రగడ గురించి అంటూనే.. నాకు ఇప్పటిదాకా ముద్రగడ కూతురు క్రాంతి తెలియదు. జనసేనలో చేరుతానంటే తండ్రీ కూతుళ్లను వేరుచేయడం నాకు ఇష్టం లేదు. తండ్రి బాధను అర్థం చేసుకునేవాడిని. కూతురు బాధ్యతను కూడా గౌరవిస్తాను. ఎన్నికల కోసం వాడుకునే ఉద్దేశం నాకు లేదు. నన్ను మీ ఇంటికి తీసుకువెళ్లండి.. అప్పుడు ముద్రగడకు చెప్పి అందరు కుటుంబసభ్యులతో సహా జనసేనలోకి సంపూర్ణంగా ఆహ్వానిస్తా.. అని పవన్ చెప్పారు.
200రూపాయలు తీసుకుని వచ్చే కూలీలకు కండువాలు కప్పేసి నాయకులు మురిసిపోతున్న రోజుల్లో, నాయకురాలు స్వయంగా వస్తే.. కుటుంబం విచ్ఛిన్నం కాకూడదని అంటూ.. పార్టీలో చేర్చుకోకుండా తిరస్కరించిన పవన్ ఔన్నత్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.