వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. జనసేనాని పవన్ కల్యాణ్ మీద వ్యక్తిగత శత్రుత్వం స్థాయిలో పగబట్టారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అత్యంత దూకుడుగా సాగుతున్న విమర్శలతో జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ వచ్చిన నాయకుడు పవన్ కల్యాణ్. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జగన్ కుట్రలను మొదట బయటపెట్టింది కూడా ఆయనే. పైగా పవన్ కల్యాణ్ గురించి విమర్శించడానికి జగన్ వద్ద ఒక అస్త్రం కూడా ఉండేది కాదు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడనే మాట తప్ప.. పవన్ ను మరొకటి అనలేకపోయారు జగన్. పైగా అలా భార్యల గురించి మాట్లాడడం జగన్ ను లేకిబుద్ధిగల మనిషిగా ప్రజల ముందు ఆవిష్కరించింది. ఇలాంటి కారణాలన్నీ ఒక ఎత్తు అయితే.. ఎన్డీయే కూటమి మళ్లీ జట్టు కట్టడానికి పవన్ ఇరుసులాగా కీలకంగా వ్యవహరించాడనేది.. జగన్ కు ఉన్న అతిపెద్ద కక్ష. జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ ఈ మంత్రాంగం నడిపారు. ఇలాంటి కారణాల చేత.. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ ను ఓడించాలనే ఉద్దేశంతో పిఠాపురం మీద జగన్ చాలా చాలా ఫోకస్ పెట్టారు.
పైగా జగన్మోహన్ రెడ్డి అహంకారం ఎలాంటిదంటే.. తాను పగబట్టిన ప్రత్యర్థులను ‘ఆడదాని చేతిలో ఓడించాను’ అని చెప్పుకోవాలనేది ఆయన కోరిక! అందుకే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ మీద, మొన్నటిదాకా ఎంపీగా ఉన్న వంగా గీతను తీసుకువచ్చి పోటీచేయించారు. కాపు సామాజిక వర్గం కావడం తప్ప.. ఆ రకంగా పవన్ కు పడగల ఓట్లను చీలుస్తారనే ఆశ తప్ప ఆ నియోజకవర్గంలో ఆమెను పోటీచేయించడం వెనుక జగన్ కు మరో ఉద్దేశం లేదు. అలాగే నారా లోకేష్ మీద మురుగుడు లావణ్యను ప్రత్యర్థిగా దింపడాన్ని కూడా మనం గమనించాలి.
వంగా గీత కోసం ప్రచారం చిట్టచివరి రోజున భారీ సభనే నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ ముఖ్యమంత్రిని చేస్తానంటూ పిఠాపురం ప్రజలకు పెద్దబిస్కట్లే వేశారు. ఓటర్లకు భారీగా డబ్బులు పంచేందుకు కూడా నిధులు సరఫరాచేశారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అక్కడ కూటమి నేతల్లో ఐక్యత లేదనే దుష్ప్రచారం ఒకవైపు. వైసీపీ అనుకూల విషపు మీడియా..పిఠాపురం తెలుగుదేశం అభ్యర్థిగా ఆశ పెట్టుకున్న వర్మ , సరిగా పనిచేయడం లేదని, ఆయనే పవన్ ను ఓడించబోతున్నారని విషప్రచారం సాగించారు. అయితే చంద్రబాబు తొలివిడతలోనే ఎమ్మెల్సీ పదవి గ్యారంటీ ఇవ్వడంతో సంతృప్తి చెందిన వర్మ.. పవన్ విజయం కోసం చిత్తశుద్ధితో, చెమటోడ్చి పనిచేశారు. పవన్ రాష్ట్రవ్యాప్త ప్రచారాలు నిర్వహిస్తుండగా.. నియోజకవర్గాన్ని మొత్తం తనే చూసుకున్నారు. నాగబాబు పర్యవేక్షణ కూడా దానికి తోడైంది. నిజంచెప్పాలంటే.. అనేక మంది సినిమా నటులు వచ్చి పిఠాపురంలో నిర్వహించిన ప్రచారం మొత్తం వారి తృప్తికోసం చేయడమే. కానీ అంతకుముందే పవన్ విజయం ఖరారు అయిపోయింది.
వంగా గీత మీద స్థానికంగా ప్రజల్లో సానుకూలాభిప్రాయం లేకపోవడంతో పాటు అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అసంతృప్తిని జగన్ బుజ్జగించలేకపోయారు. ఆయన వంగా గీత కోసం మనస్ఫూర్తిగా పనిచేయనేలేదు. ఆ పార్టీలో లుకలుకలు ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయి. డబ్బు పంచినా సరే.. ఫలితం లేని దుస్థితి ఏర్పడింది. ప్రచారంలో పవన్ కల్యాణ్ దూకుడును ఆమె ఏమాత్రం తట్టుకోలేకపోయారు. ఇన్ని కారణాల నేపథ్యంలో.. పవన్ విజయం ఏకపక్షంగా మారిపోయింది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ లక్ష ఓట్ల రికార్డు మెజారిటీతో గెలువబోతున్నారని ప్రజలు అంటున్నారు.