జగన్ కు పవన్ కల్యాణ్ డైరెక్ట్ వార్నింగ్!

మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ డైరెక్టుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హద్దు దాటి అతిగా మాట్లాడితే ఆయన మీద సుమోటోగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో పాలన సాగిస్తున్న తమది.. మంచి ప్రభుత్వమే తప్ప మెతక ప్రభుత్వం కాదని పవన్ వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన స్థాయి మరిచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వార్నింగ్ ఇస్తే.. ఆయన మీద సుమోటోగా కేసులు పెట్టడం జరుగుతుందని పవన్ కల్యాణ్ డైరెక్టుగా అనడం గమనార్హం.

తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో అప్పటి పోలీసుయంత్రాంగాన్ని వాడుకుని జగన్ సర్కారు అడుగడుగునా ఎన్నెన్ని ఇబ్బందులు సృష్టిస్తూ వచ్చిందో అందరికీ తెలుసు. అనేక పర్యాయాలు కోర్టుకు వెళ్లి మరీ లోకేష్ అనుమతులు తెచ్చుకుంటూ యాత్ర సాగించారు. ఆ సమయంలో ప్రత్యేకించి పోలీసు అధికారుల తీరుతో విసిగిపోయిన నారా లోకేష్.. జగన్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులందరి పేర్లను తన వద్ద ఉన్న రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నానని, తమ ప్రభుత్వం వచ్చాక వారికి తగిన ట్రీట్మెంట్ ఉంటుందని హెచ్చరించారు. అప్పట్లో అలా హెచ్చరించారే తప్ప.. ఇప్పటిదాకా రెడ్ బుక్ పేరుతో ఎవ్వరిమీదా కక్ష సాధింపు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అలాగే పర్టిక్యులర్ గా ఫలానా అధికారి అంటూ పేరు చెప్పి హెచ్చరించడం కూడా జరగలేదు.

కానీ జగన్మోహన్ రెడ్డి  తీరు వేరు. ఆయన పోలీసు అధికార్ల పేర్లు ప్రస్తావించి మరీ బెదిరిస్తున్నారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుని సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొస్తామని, డీజీపీ ద్వారకా తిరుమల రావును రిటైర్ అయినా సరే వదలబోమని జగన్ బెదిరిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులపై పవన్ కల్యాణ్ గుస్సా అవుతున్నారు. ‘మీరు బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరు. అధికార్లపై చిన్న గాటుపడినా ఊరుకోం. ఈగవాలినా  మీరే బాధ్యత వహించాలి. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదు..’ అంటూ పవన్ కల్యాణ్ డైరెక్టుగా జగన్ కే వార్నింగ్ ఇస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి అనవసరంగా నోటిదూకుడు, అర్థంలేని డైలాగులతో కొత్త వివాదాలను సృష్టించుకుంటున్నారని ఆయన అభిమానులే అంటున్నారు.

Previous article
Next article

Related Posts

Comments

spot_img

Recent Stories