జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒక మ్యాజిక్ ఆవిష్కృతం అయింది. తెలుగుదేశం పార్టీ తరఫున గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ఈ ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై వారి కోసం పాటుపడుతూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఇప్పుడు పూర్తిస్థాయిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం కోసం పనిచేస్తున్నారు. పిఠాపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎన్నో ఆశలు పెంచుకొని స్థానికంగా కష్టపడిన వర్మ, పవన్ కళ్యాణ్ ఆస్థానాన్ని ఎంచుకున్న తర్వాత తొలుత కొంత అసంతృప్తికి లోనైనప్పటికీ తర్వాత అంతా సర్దుకుంది. ఆయన ఇప్పుడు తానే అభ్యర్థి అయినంత శ్రద్ధగా పవన్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ‘చంద్రబాబు గారు చెప్పారు.. నేను మిమ్మల్ని గెలిపిస్తాను’ అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో వర్మ దూసుకుపోతున్నారు.
పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గానికి వెళ్లగానే వర్మ ఇంటికే వెళ్లారు, అక్కడ భోజనం చేశారు. స్థానికంగా నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయో, వనరులను ఎలా వినియోగించుకునే అవకాశం ఉన్నదో, ప్రజలకు ఎలాంటి మేలు చేయాలనే హామీలు ఇవ్వగలమో ఆయన స్పష్టంగా వర్మ ద్వారా తెలుసుకొని ఆ సాయంత్రం ఎన్నికల ప్రచార సభలో మొత్తం తన ప్రసంగాన్ని ప్లాన్ చేసుకున్నారు.
ప్రచార కార్యక్రమాలలో ఆయన తెలుగుదేశం కీలక నాయకుడు వర్మను పూర్తిగా తన వెంట తిప్పుతున్నారు. తెదేపా నాయకుడు వర్మ చిత్తశుద్ధిని, అర్హతలను పవన్ కళ్యాణ్ ఘనంగా కీర్తిస్తున్నారు. వర్మ కూడా అంతే శ్రద్ధగా పవన్ విజయం కోసం ఇంటింటికి తిరుగుతుండడం విశేషం. పిఠాపురంలో ఆవిష్కృతమైన మ్యాజిక్, ఈ అద్భుతమైన సహకారం, సమన్వయమే!
ఇదే తరహా మ్యాజిక్ జనసేన తరఫున కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆవిష్కృతం అయ్యేలా పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపి పోటీచేస్తున్న 154 నియోజకవర్గాల్లో తమ పార్టీ శ్రేణులు ఇంతే మనస్ఫూర్తిగా ఇంతే చిత్తశుద్ధితో ఎన్డీయే అభ్యర్థుల విజయానికి పనిచేసేలా వారందరికీ సర్దిచెప్పి కార్యక్షేత్రంలో దించడానికి పవన్ తరఫున పార్టీ పెద్దలు చొరవ తీసుకోవాలి. నాగేంద్రబాబు వంటి పెద్దలు ఎటూ ఈ ఎన్నికల్లో ప్రత్క్ష్యక్షంగా తలపడకుండా పార్టీ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారిని ఇలాంటి కీలక బాధ్యతలకు ఉపయోగించుకోవాలి. పిఠాపురంలో ఇతర పార్టీల సహకారం ఎలాంటి ఆత్మవిశ్వాసాన్ని గెలుపుపై భరోసాను అందిస్తుందో పవన్ అనుభవిస్తున్నారు. అదే భరోసాను ఆయన తన పార్టీ తరఫున తతిమ్మా 154 నియోజకవర్గాల్లో అందించాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలి.