కామెడీలందు పాల్ కామెడీ వేరయా..!

మానవ జీవితం ఎంతో కొంత హాయిగా ముందుకు సాగాలంటే కామెడీ కొంత అవసరం. కూరలో ఉప్పు ఎలా తప్పనిసరిగా ఉండాలో.. ప్రతి వ్యవహారంలోనూ కాస్త హాయిగా నవ్వుకోవడానికి కొంత కామెడీ ఉండాల్సిందే. అందుకే ఎంత సీరియస్ సినిమాలు అయినా సరే.. ఒక కామెడీ ట్రాక్.. లేదా పరిమితంగా కొన్ని కామెడీ సీన్లు తప్పకుండా పెడతారు. రాజకీయాల్లోనైనా అంతే.. కొందరు నాయకులు కమెడియన్ల పాత్ర పోషిస్తుంటారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలు అత్యంత ఉద్రిక్త భరితమైన వాతావరణంలో జరుగుతుండగా.. ప్రజలకు ఆ ఉద్రిక్తతలనుంచి కాస్త ఉపశమనం ఇవ్వడానికా అన్నట్టుగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ కామెడీ చేస్తున్నారు.

ఇంతకూ ఆయన ఏమంటున్నారో తెలుసా.. పవన్ కల్యాణ్ బరిలో ఉన్న పిఠాపురం నియోజకవర్గం నుంచి తాను పోటీచేయాలంటూ.. ఆయనకు అనేక రిక్వెస్టులు వస్తున్నాయట. వాటి గురించి ఆయన ఇంకా ఆలోచిస్తున్నారట. కానీ శృంగవరపు కోట నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారట. అదే సమయంలో విశాఖపట్నం నుంచి ఎంపీగా కూడా పోటీచేస్తున్నారట. ఇదొక ఎత్తు అయితే.. నిధుల గురించి ఆయన చెబుతున్న ప్రస్తావన ఇంకో ఎత్తు.

రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టేసిన జగన్మోహన్ రెడ్డి కావాలో, అయిదు లక్షల కోట్ల రూపాయల డబ్బును ప్రజలకు దానంగా ఇచ్చేసిన (ఆయన ఎప్పుడు ఎలా సదరు  దానం ఇచ్చారో ఆ ప్రెస్ మీట్ లో ఎవ్వరూ అడిగినట్టు లేదు) కెఎపాల్ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలట. ఇప్పుడు తన పార్టీకి ఓట్లు వేసి.. తనను ముఖ్యమంత్రిగా గెలిపిస్తే పదిలక్షల కోట్ల రూపాయల అప్పును కూడా తీర్చేస్తాడట. ఇంకా రాష్ట్ర అభివృద్ధి కోసం యాభై లక్షల కోట్ల రూపాయలు నిధులు కూడా తీసుకువస్తాడట. .. ఇన్ని రకాల మాటలతో ఆకర్షణీయమైన లక్షల కోట్ల రూపాయల విలువైన కామెడీ చేస్తున్నారు కెఎ పాల్.

తన సొంతానికి బోయింగ్ విమానాలను కలిగి ఉండినప్పటికీ.. వివాదాల కారణంగా.. వాటిని కొన్నిఏళ్లుగా ఎయిర్ పోర్టు బేస్ లలోనే నిలిపిఉంచి.. వాటికి అద్దె కడుతున్న కెఎ పాల్.. ఎప్పుడు నోరు తెరచినా.. లక్షల కోట్ల రూపాయలలోనే మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా.. ఈసారి తెలంగాణ సీఎం కాబోయేది తానేనని ఆయన చాటుకున్నారు. ఎవరనా నమ్మకపోతే వారు మూర్ఖులని కూడా అన్నారు. ఇప్పుడు ఏపీ ఎన్నికల సీజన్ మొదలు కాగానే.. తన కామెడీ షో అక్కడ ప్రారంభించారు. పదిలక్షల కోట్ల అప్పులు తీర్చడంతోపాటు, ఏకంగా యాభైలక్షల కోట్ల నిధులు తెస్తానంటున్నారు.

ఇప్పుడు పిఠాపురంలో పోటీచేయాలని తనకు ఆహ్వానాలు అందుతున్నట్టు ఆయన ప్రకటన చేయగానే, అక్కడి అభ్యర్థి జనసేనాని పవన్ కల్యాణ్ ఉరుకులు పరుగుల మీద తన చెంతకు వచ్చి, పోటీచేయొద్దు సార్.. నాకు కష్టం అని బతిమాలుతారని కెఎ పాల్ ఆశిస్తున్నారో ఏమో తెలియదు!

Related Posts

Comments

spot_img

Recent Stories