ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోటివెంట నామినేటెడ్ పదవుల పందేరం గురించిన కబురు వినగానే.. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ వస్తోంది. పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికే ఈసారి నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నట్టుగా చంద్రబాబునాయుడు ముందునుంచి సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అదే విధంగా.. ఎన్నికల సమయంలో కూటమిలోని మూడు పార్టీలు ఏ దామాషాలో అయితే సీట్లను పంచుకున్నాయో అదే దామాషాలో నామినేటెడ్ పదవుల పంపకం కూడా ఉంటుందని ఆయన క్లారిటీ ముందే ఇచ్చేశారు. ఇప్పుడు ఎవ్వరిలోనూ ఎలాంటి సంశయమూ సందిగ్ధత లేదు.
ఇప్పుడిక, పరిపాలన వంద రోజుల మైలురాయిని కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకున్న తరువాత.. నామినేటెడ్ పదవుల పందేరం త్వరలోనే ఉంటుందని చంద్రబాబునాయుడు చెబుతుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండుతోంది. నిజానికి పదవుల పంపకం అనేది నెలకిందటే జరిగి ఉండాలి. చంద్రబాబునాయుడు గతంలో- వందరోజుల మైలురాయి అందుకునేలోగానే.. నామినేటెడ్ పదవులు పూర్తిచేస్తామని ప్రకటించారు. కానీ ఆ సమయానికి బుడమేరు కారణంగా బెజవాడకు వాటిల్లిన ముప్పు, తదితర వ్యవహారాల్లో అందరూ నిమగ్నం అయిపోయారు. పదవుల గురించి ఆలోచించే ధ్యాస కూడా ఎవ్వరికీ లేకుండా పోయింది. ఆ విపత్కర వాతావరణం మొత్తం సద్దుమణిగిన తరువాత.. చంద్రబాబునాయుడు తాజాగా నామినేటెడ్ కసరత్తును తిరిగి మొదలెట్టినట్టుగా కనిపిస్తోంది.
వందరోజుల ప్రభుత్వ పరిపాలన సక్సెస్ లను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు హితోక్తులు చెబుతున్నారు. ఎటూ పార్టీ కోసం కష్టించేవారికే నామినేటెడ్ పదవులనే మాట ఖాయమే గనుక.. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో శ్రేణులు ముమ్మరంగా పాల్గొంటారనే అభిప్రాయం అంతటా వ్యక్తం అవుతోంది.
ఈ ఏడాది అక్టోబరు 5వ తేదీనుంచి తిరుమల వేంకటేశ్వరస్వామివారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మొదలు కాబోతున్నాయి. ఈవో తదితరులు సీఎం చంద్రబాబును కలిసి ఆహ్వానపత్రిక అందించారు కూడా. ఈ ఏడాది ఈవో తప్ప, టీటీడీ ఛైర్మన్ పేరు లేకుండానే ఆహ్వాన పత్రికలు తయారయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మోత్సవాలు మొదలయ్యేలోగా టీటీడీ బోర్డు నియామకం ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీటీడీతో పాటు పలు కీలక పదవులకు కూడా ఒకేసారి ప్రకటన ఉంటుందని అంటున్నారు.