పేర్ని కిట్టూ: ఒక దుర్యోధనుడు.. అనేక దుశ్శాసనులు!

ద్రౌపదీ వస్త్రాపహరణం ఘట్టం ఎలా జరిగింది? దుర్యోధనుడు ఏమైనా  స్వయంగా ఆమె చీర పట్టుకుని విప్పడానికి ప్రయత్నించాడా. చెరపట్టడానికి ప్రయత్నించాడా? లేదు కదా! కానీ మనం దుర్యోధునిడిని మాత్రమే విలన్ గా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదిని దుశ్శాసనుడు జుట్టుపట్టి సభలోకి లాక్కువచ్చినా, చీర ఊడబీకి అవమానించినా.. అవన్నీ దుర్యోధనుడి పురమాయింపు మీదనే చేశాడు కాబట్టి. దుర్యోధనుడు సింపుల్ గా తన సింహాసనం మీద కూర్చుని చోద్యం చూస్తూ ఉన్నప్పటికీ.. విలన్ మాత్రం ఆయనే.

అచ్చంగా అదే సీన్ ఇప్పుడు మచిలీపట్నంలో రిపీట్ అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టూ.. ఎంచక్కా కారులో కూర్చుని జరుగుతున్న దృశ్యాల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన అనుచరులు మాత్రం ఒక మహిళ మీదికి ఎగబడి రాయడానికి కూడా వీల్లేనంత అసభ్యంగా ఆమె పట్ల ప్రవర్తిస్తూ రెచ్చిపోయారు. అడ్డొచ్చిన ఆమె పిల్లల్ని కొట్టారు. భర్త వస్తే అతడిని కూడా కొట్టారు. వ్యవహారం అక్కడినుంచి పోలీసు స్టేషనుకు వెళ్లిన తర్వాత.. సదరు కిట్టూ తరఫు దుశ్శాసనులు అక్కడకు కూడా చేరుకున్నారు. సాక్షాత్తూ పోలీసుల ఎదుటే మళ్లీ ఆమె భర్తపై ఎడాపెడా పిడిగుద్దులు కురిపిస్తూ నీకు రాజకీయాలు ఎందుకురా అని ప్రశ్నిస్తూ రెచ్చిపోయారు.
పేర్ని కిట్టూ దుర్యోధనుడిలాగా చోద్యం చూస్తూ కారులో కూర్చోగా, అనుచరులు దుశ్శాసనుల్లాగా రెచ్చిపోగా.. పోలీసులు మాత్రం శకుని మామలాగా, గుడ్డి ధృతరాష్ట్రుడిలాగా సైలెంట్ గా ఉండిపోయారు.

ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా..? కిట్టూ ప్రచారం సందర్భంగా.. ఆయన అనుచరులు పెద్దఎత్తున బాణసంచా కాలిస్తే అవి ఒక ఇంట్లోకి దూసుకువెళ్లాయి. అది జనసేన తరఫున కార్పొరేటరుగా పోటీచేసి ఓడిపోయిన మహేష్ ఇల్లు. ఆయన భార్య, తల్లి, ఆడవాళ్లు బయటకు వచ్చి ఎందుకు బాణసంచా కాలుస్తున్నారంటూ ప్రశ్నించారు. అందుకు ఆయన భార్యపై పైశాచికంగా ప్రవర్తించిన కిట్టూ దుశ్శాసనులు, మహేష్ తల్లిపై కూడా దాడిచేసి గాయపరిచారు.

చివరికి పోలీసుస్టేషన్ వద్దకు తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి ఇద్దరూ చేరుకుని పోలీసుల వైఖరిని దుయ్యబట్టారు. ఎస్పీకి ఫిర్యాదుచేశాక.. ఆయన 24 గంటల్లో చర్య తీసుకుంటానని హామీ ఇవ్వడంతో అప్పటికి వ్యవహారం సద్దుమణిగింది. పోలీసుల ప్రేక్షకపాత్ర, కిట్టూ దుశ్శాసనపర్వం గురించి.. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయనున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories