పరార్ : పిన్నెల్లి ని పోలీసులే తప్పించారా?

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా చలామణి అవుతున్నది. ఆయన అరెస్టు కోసం బయలుదేరిన పోలీసు బృందాలు అంత అమాయకంగా ఎలా వ్యవహరించాయా? అనే అనుమానం ప్రజలలో కలుగుతుంది. ఇంటి బయట పోలీసులు వేచి చూస్తుండగా, పిన్నెల్లి వాహనం బయటకు వచ్చిందని.. పోలీసులు దానిని వెంబడిస్తూ వెళ్లినప్పటికీ కూడా.. కొద్దిసేపటి తర్వాత రోడ్డుపక్కగా ఆగిన వాహనంలో కేవలం డ్రైవరు, గన్ మాన్ మాత్రం దొరికారని, పిన్నెల్లి దొరకలేదని వార్తలు వస్తున్నాయి. వార్తలలో ఈ సంఘటనలు జరిగిన క్రమాన్ని పరిశీలిస్తే మాత్రం ఇదంతా కల్పిత కథ ఏమో అనే అనుమానం పలువురిలో కలుగుతోంది.

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో అధికారుల తీరు ఇప్పుడు సర్వత్రా అనుమానాస్పదంగా నిరూపణ అవుతుంది. పోలింగ్ బూత్ వీడియోలు విడుదల అయిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత అరాచకంగా వ్యవహరించారో కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఆయన బూతులోకి ప్రవేశించగానే లేచి నిలబడి దండాలు పెట్టిన పోలింగ్ అధికారి దగ్గర నుంచి.. అక్కడి సీసీ కెమెరాలలో స్పష్టంగా ఎమ్మెల్యే కనిపిస్తున్న సంగతి స్పృహ కూడా లేకుండా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఈవీఎంలు పగలగొట్టి వెళ్ళారని తొలుత  కేసులు నమోదు చేసిన వీఆర్వో, పుటేజి గురించి పట్టించుకోని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సహా పలువురి పాత్ర ప్రశ్నార్ధకంగా నిలుస్తుంది.

అదే క్రమంలో మాచర్ల నుంచి హైదరాబాదు పారిపోయిన రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్ళిన పోలీసు బృందాలు కూడా ఆయనకు అనుకూలంగా పనిచేశాయా? ఆయనకు సహకరించాయా? అనే అనుమానం కొత్తగా కలుగుతోంది. అలసత్వంతో స్పందించి రామకృష్ణారెడ్డి పారిపోయే వ్యవధి ఇచ్చారని వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన హైదరాబాదు నుంచి పోలీసులు కళ్ళు కప్పి చెన్నై పారిపోయినట్టుగా మీడియాలో వస్తున్నది గాని.. అరెస్టు భయంతో ఈపాటికి దేశం విడిచి వెళ్లిపోయి ఉంటారని కూడా కొందరు అంటున్నారు. మొత్తానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఆలస్యంగా కేసు నమోదు కావడం దగ్గర నుంచి, ఆయనను అరెస్టు చేయలేక పోయిన వైఫల్యం వరకు అనువణువునా అధికార యంత్రాంగం, పోలీసు వ్యవస్థల అసమర్ధత బయటపడుతున్నదని ప్రజలు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories