సరిహద్దు గ్రామాలపై పాక్ దాడులు: 10 మంది మృతి!

భారతదేశం ఎంతో సంయమనం పాటించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోనూ, పాక్ ఆక్రమిత కాశ్మీరులోను ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు చేసింది. ఎంపిక చేసిన తొమ్మిది స్థావరాల మీద ప్రత్యేకమైన హామర్ స్మార్ట్ బాంబులను క్రూయిజ్ మిసైళ్ల ద్వారా ప్రయోగించి అత్యంత ఖచ్చితత్వంతో తాము ఎంచుకున్న లక్ష్యాల మీద మాత్రమే బాంబులు కురిపించింది. భారత్ సైన్యం అటు పాకిస్థాన్లోని జనావాసాలకు గాని పాకిస్తాన్ సైనిక శిబిరాలకు గాని కించిత్ నష్టం వాటిల్లకుండా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంది అయితే ఇందుకు జవాబుగా పాకిస్తాన్ సైన్యం వ్యవహరిస్తున్న తీరు మాత్రం పూర్తిగా యుద్ధాన్ని కోరుకుంటున్నట్టుగానే ఉన్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తాము చేస్తున్న దాడుల వలన ఎలాంటి ఉద్రిక్తతలు ముందు ముందు పేట్రేగకుండా ఉండడానికి భారత సైన్యం అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంది. కేవలం ఆ ఉద్దేశంతోనే పాక్ సైనిక శిబిరాలను కూడా టార్గెట్ చేయకుండా జాగ్రత్త తీసుకున్నారు. అయితే పాకిస్తాన్ సైన్యం సరిహద్దు రేఖ వెంబడి భారతీయ గ్రామాల మీద పౌరుల మీద విచ్చలవిడిగా కాల్పులు ప్రారంభించింది. మోర్టార్లను కూడా ప్రయోగిస్తోంది.

పూంచ్, రాజోలి, సెక్టార్ల తో పాటు ఇంకా పలు ప్రాంతాలలో సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలపై పాకిస్తాన్ సైన్యాలు గుళ్ల వర్షం కురిపిస్తున్నాయి. కేవలం తుపాకుల కాల్పులు మాత్రమే కాకుండా ఫిరంగుల ద్వారా మోర్టార్ షెల్స్ ను కూడా గ్రామాల మీదకి ప్రయోగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యం చేస్తున్న దాడులలో సరిహద్దు గ్రామాలలో పదిమంది మరణించినట్లుగా సైన్యం ప్రకటించింది. ఇది ఖచ్చితంగా భారత్ ను  రెచ్చగొట్టే చర్యలే అని పలువురు భావిస్తున్నారు. భారత్ పొరబాటున కూడా పాకిస్తాన్ పిఓకే లలోని జనావాసాలపై బాంబులు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే.. పాకిస్తాన్ సైన్యం సరిహద్దు వెంబడి  మోర్టార్ష్లు ఎక్కడ పడతాయో కూడా తెలియని విధంగా ఫిరంగుల ద్వారా వాటిని గ్రామాల మీద వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసినందుకు పాకిస్తాన్ సమాధానం చెబుతున్న తీరు.. యుద్ధాన్ని మరింతగా కోరుకున్నట్లు ఉన్నదని ప్రజలు అంటున్నారు.
ఒకవైపు అమెరికా జోక్యం చేసుకుని.. పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగకూడదని హెచ్చరించింది. ప్రస్తుతం పాక్ కొనసాగిస్తున్న కాల్పులకు భారత సైన్యం దీటుగానే సమాధానం చెబుతున్నప్పటికీ.. పాక్ ఈ కవ్వింపుచర్యలను కొనసాగిస్తే గనుక.. యుద్ధాన్ని కోరుకున్నట్టేనని అందుకు భారత్ సిద్ధంగానే ఉన్నదని భారత్ సైన్యం ప్రకటిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories