మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల కిందట తన పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. జగన్ తర్వాత.. పార్టీకి డీఫ్యాక్లో అధినేతగా వ్యవహరించే సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆ కమిటీకి కన్వీనరు. రీజినల్ కోఆర్డినేటర్లుగా చక్రంతిప్పే ప్రముఖులు అందులో శాశ్వత ఆహ్వానితులు వీరు కాకుండా మంత్తం 33 మంది సభ్యులను నియమించారు. ఈ కమిటీలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందే పార్టీలో చేరిన కిర్లంపూడికి చెందిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభ రెడ్డికి కూడా చోటు దక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక కమిటీలో తనను గుర్తించి అవకాశం కల్పించినందుకు ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇప్పుడు మహా మురిసిపోతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ అని పెద్ద పెద్ద పవులను చూసుకుని.. ముద్రగడ చాలా ఆనందిస్తున్నట్టు కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి సలహాలు చెప్పగల నాయకుడిగా తనను గుర్తించినందుకు ఆయనలో ఈ ఆనందం వెల్లువెత్తుతున్నట్టుంది. జగన్ కు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఒక ధన్యవాదాల లేఖ రాశారు. జగన్ పట్ల తన అపార భక్తి ప్రపత్తులను ఆయన ప్రదర్శించుకున్నారు. ‘ముద్రగడ పద్మనాభ రెడ్డి’ అని చాలా పెద్దపెద్ద అక్షరాలతో ముద్రించుకున్న తన లెటర్ హెడ్ మీద ఆయన రాసిన లేఖ ఇలా ఉంది. ‘‘తమరు అభిమానంతో ప్రేమతో నన్ను పీఏసీ (పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ)లో మెంబరుగా నియమించారని టీవీలో చూశానండి. చాలా సంతోషం అండి. తమరు నా మీద పెట్టిన బాధ్యత మీరు అధికారంలోకి వచ్చేవరకు నా వంతు కృషితో త్రికరణ శుద్ధిగా కష్టపడతానండి. పేదవారికి మీరే ఆక్సిజన్. ఈ దఫా తమరు అధికారంలోకి వచ్చిన తరువాత.. ఈ ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పరిపాలన పదికాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి’’ అని రాశారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడిస్తానని భీషణ ప్రతిజ్ఞచేసి ఫెయిలయినందుకు తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న ఈ కాపు నేత ఇప్పుడు సంతకం కూడా పద్మనాభ రెడ్డిగానే చేస్తున్నారు. తమాషా ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డి 33 మందికి ఈ అడ్వయిజరీ కమిటీ పదవులు ఇవ్వగా.. వారిలో అసలు స్పందించి థాంక్స్ చెప్పినది ముద్రగడ ఒక్కరే. ఇంతకూ ఆ లేఖలో.. ‘నియమించారని టీవిలో చూశానండి’ అని చెప్పడం ద్వారా.. తనకు ముందుగా సమాచారం కూడా ఇవ్వకుండా ఏకంగా టీవీల్లో ప్రకటించేశారని ముద్రగడ నర్మగర్భంగా వెటకారం చేస్తున్నారో ఏమో అర్థం కాని సంగతి. ఆ వెటకారం అర్థం కాకుండా.. 33 మందిలో ఒకడు థాంక్స్ చెబుతూ లెటరు రాసేసరికి.. వైసీపీ అధినేత కూడా అందుకు మహా మురిసిపోయి అదొక పెద్ద వార్తలాగా తన కరపత్రికలో అచ్చు వేసుకున్నారు. ముద్రగడ రెడ్డి స్థాయిలో మరెవ్వరూ పొగడరు గనుక.. లెటరును యథాతథంగా స్కాన్ చేసి మరీ ప్రచురించుకున్నారు. 33 మందిలో ఒకడిగా కులాల తూకం కోసం ముద్రగడ పేరును జాబితాలో చేరిస్తే.. అక్కడికేదో తాను నిజంగా వైసీపీని ఉద్ధరించే సలహాలు చెప్పబోయే పోస్టులోకి వెళ్లిపోయినట్టుగా ఆయన మురిసిపోయి పండగ చేసుకోవడం కామెడీగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.