ఓవరాక్షన్ : అన్నప్రాసన నాడే ఆవకాయ డైలాగులు!

రెగ్యులర్ గా రాజకీయాలు ఫాలో అయ్యేవారికి కూడా మలసాల భరత్ అనే పేరు కొత్తే. కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ.. మొన్నమొన్నటిదాకా అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటూ గడిపిన ఈ మలసాల భరత్.. ఒక్కసారిగా హెలికాప్టర్ షాట్ లాగా వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వాలిపోయి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో గతంలో వైసీపీ తరఫున గుడివాడ అమర్నాధ్ గెలిచారు. అయితే.. ఈ అయిదేళ్లలో అమర్నాధ్ అత్యంత అసమర్థుడిగా పేరుపడ్డారా.. లేదా, మలసాల భరత్ చూపించిన బలం, ప్రకటించిన ఆఫర్లు జగన్ ను ఊరించాయో తెలియదు గానీ.. మొత్తానికి అమర్నాధ్ ను గాజువాకకు బదిలీచేసేసి.. అనకాపల్లి టికెట్ భరత్ చేతిలో పెట్టారు.
ఈ నియోజకవర్గం నుంచి కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా కొణతాల రామక్రిష్ణ రంగంలోకి దిగారు. అనకాపల్లి ఎంపీ సీటు నుంచి బిజెపి అభ్యర్థిగా సీఎం రమేష్ బరిలో ఉండడం ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా కూటమికి కలిసొచ్చే అంశంగా మారింది. అసలే జగన్ సర్కారు పట్ల రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన వ్యతిరేకతకు తోడు స్థానిక కారణాలు కూడా జతకలవడంతో.. అనకాపల్లి ఎమ్మెల్యేగా కొణతాల గెలుపు ఖాయం అని అందరూ అనుకుంటున్నారు.
అయితే, మలసాల భరత్ మాత్రం.. రాజకీయంగా అరంగేట్రం చేసిన ఈ తొలి ఎన్నికల్లోనే ఆవకాయ ఘాటును మించిపోయిన డైలాగులు వల్లిస్తున్నారు. రాబోయే ముప్పయ్యేళ్లపాటు అనకాపల్లిలో నేనే ఎమ్మెల్యేగా ఉండబోతున్నాను.. అని ఈ యువనాయకుడు ఫలితాలకు ముందే ప్రకటించేస్తున్నారు. 2029లో కూడా జగన్ తనకే టికెట్ ఇస్తారని, ఇప్పుడు గెలిచిన తర్వాత.. రాబోయే అయిదేళ్లలో తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎంత గొప్పగా పనిచేస్తానో చూసి డంగైపోయి జగన్ మళ్లీ టికెట్ ఇచ్చి తీరుతారని భరత్ చెప్పుకుంటున్నారు.
మామూలుగా అయితే అనకాపల్లి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఏదో గత ఎన్నికల్లో వారు అక్కడ గెలవలేకపోయారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ బలం కూడా తోడై.. అక్కడ కూటమి విజయదుందుభి మోగిస్తుందని అంచనాలు సాగుతున్నాయి. అయితే రాజకీయాల్లో ఇంకా బొడ్డూడని ఈ కుర్ర నాయకుడు, ఆవకాయ డైలాగులు వల్లిస్తుండడం జనానికి నవ్వు తెప్పిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories