అమరావతి రాజధాని నిర్మాణం కోసం అన్ని రకాలుగా సహకారం అందిస్తూ ముందుకు సాగుతున్న మాట నిజమే గానీ.. కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, కొన్ని ప్రతిపాదనల విషయంలో వ్యవహరిస్తున్న తీరు కొత్త అనుమానాలను కలిగిస్తోంది. అమరావతి దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఆవిర్భవించేందుకు తమ వంతు తోడ్పాటు ఇవ్వడంలో కొన్ని మెలికలు పెట్టాలనుకుంటున్నారా? అనిపిస్తోంది. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడం బాగుంది. కానీ.. 150 మీటర్ల వెడల్పున భూసేకరణ చేయాలని ప్రతిపాదిస్తే.. అందులో కేవలం 70 మీటర్ల వెడల్పు చాలునంటు కేంద్రం క్వర్రీలు పెట్టడం ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి. అమరావతి ఓఆర్ఆర్ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని ప్రజలు అభ్యర్థిస్తున్నారు.
అమరావతిలో పూర్తి మైదానంలా ఉన్న ప్రాంతంలో ఒక సరికొత్త నగరాన్ని నిర్మించబోతున్నారు. ఇలాంటి నగరంలో ఎన్ని అద్భుతాలు చేయడానికైనా అవకాశం ఉంటుంది. ఒక పర్ఫెక్ట్ సర్కిల్ లాగా.. పెన్సిలుతో గీసినట్టు అవుటర్ రింగ్ రోడ్డును నిర్మించాలనుకున్నా కూడా సాధ్యం అవుతుంది. అయితే.. ఈ అమరావతి నగరం అనేది ముందుముందు ఎంత మహాద్భుత నగరంగో ఎదగబోతున్నదో ఊహించడంలోనే అసలు విషయంలో ఉంది. కేంద్రం 70 మీటర్లు చాలు.. ఆరు వరసల రోడ్లు చాలు అని అనడం భవిష్యత్ అవసరాలకు సరిపోతుందా అనేది కీలకాంశం. ఈ దశలో భూసేకరణ అనేది చాలా సులువు. 150మీటర్లు అవుటర్ కోసం సేకరిస్తే.. ఆ తరువాత.. దాని వెంబడి రైల్వే ట్రాక్ ల నిర్మాణం కూడా జరగాలని ఆ రకంగా.. అమరావతి అవుటర్ అనేది దేశంలోనే ఒక విలక్షణమైన అద్భుతమైన వ్యవస్థగా రూపొందుతుందనే ఆలోచన చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో ఉంది. కేంద్రం రైల్వే లైన్ల సంగతి తర్వాత చూసుకోవచ్చునంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు అనేది.. ఎంతో బిజీగా నిత్యం వేలాది వాహనాలకు రవాణా అవసరాలు తీర్చేదిగా ఎదిగే అవకాశం ఉంది. ముందుముందు 8, 10 వరసల హైవేగా ఎదగాల్సి వస్తుంది. అప్పటికప్పుడు మళ్లీ భూసేకరణ అంటే చాలా కష్టం అయిపోతుంది. పైగా భూసేకరణ విషయంలో అలవిమాలిన పొదుపు పాటించడం వలన.. అప్రోచ్ రోడ్లు, కనెక్టింగ్ రోడ్లు ఇవన్నీ కూడా ఇబ్బంది కరంగా తయారవుతాయి.
అమరావతి నగరం, ఆ నగరం యొక్క విస్తృత అవసరాలు ఇప్పటికిప్పుడు కళ్లముందుకు కనిపించక పోతుండవచ్చు. అలాగని భవిష్యత్తు స్వరూపాన్ని చులకన చేసి చూడడం తగదు. కేంద్రం పునరాలోచన చేసి.. ఓఆర్ఆర్ విషయంలో ఉదారంగా నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రం కోరుకుంటోంది.