ఆపరేషన్ సింధూర్ : పాక్‌లో ఉగ్ర స్థావరాల విధ్వంసం

పహల్గావ్ లో జరిగిన ఉగ్రదాడికి భారత్ తొలి దశ ప్రతీకారాన్ని పాకిస్తాన్ కు రుచి చూపించింది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ, శిక్షణలు ఇస్తూ, భారత్ లోకి ప్రవేశపెట్టి వారి ద్వారా దురాగతాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ కు బుద్ధి వచ్చేలా ఆపరేషన్ సింధూర్ పేరుతో బుధవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించింది. పాక్ ఆక్రమిత కాశ్మీరు మరియు పాకిస్తాన్ లోని కీలక ఉగ్రవాద స్థావరాలు తొమ్మిది ప్రదేశాలపై భారత వైమానిక దళం, సైనిక దళం, నౌకాదళం కలసికట్టుగా సమన్వయంతో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 9 ప్రదేశాల్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. దాదాపుగా 80 మంది వరకు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లుగా అనధికారిక వార్తల ద్వారా తెలుస్తోంది.

భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 1:28 గంటలకు ఈ వైమానిక దాడులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 9 ప్రదేశాలలో కచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడులకు పాల్పడ్డారు. అత్యంత ఆధునాతన సాంకేతికత జోడించిన, ఎంపిక చేసిన లక్ష్యాన్ని తప్ప పక్క భవనాలను కూడా ప్రమాదం వాటిల్లకుండా దాడిచేయగల క్రూయిజ్ మిసైళ్లతో ఈ దాడులు నిర్వహించడం విశేషం. రాత్రి 1:28 కి మొదలైన దాడులు 1:51కి పూర్తి కావడం గమనార్హం.  ‘న్యాయం చేశాం’ అంటూ దాడుల అనంతరం భారత ఆర్మీ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది.

భారత్ దాడితో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తమ జనావాసాలపై భారత్ దాడిచేసిందని, ఏడేళ్ల పాప సహా పౌరులు చనిపోయారని తప్పుడు కథనాలను వ్యాప్తిలో పెడుతోంది. అంతర్జాతీయ నిబంధనలను భారత్ ఉల్లంఘించింది అంటూ ఆక్రోశిస్తున్నారు. అదేసమయంలో.. అంతర్జాతీయంగా పలు దేశాలనుంచి భారత్ కు మద్దతు లభిస్తోంది. అమెరికా కూడా.. ఇరుదేశాల మధ్య ఇక శాంతియుత వాతావరణం నెలకొనాలని వ్యాఖ్యానిస్తూ.. ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్ర స్థావరాలపై దాడులు చేసే హక్కు భారత్ కు ఉందని పేర్కొంది. దీనికి సమాధానంగా మళ్లీ దాడులకు తెగబడకుండా పాకిస్తాన్ సైలెంట్ గా ఉంటే మంచిదని హెచ్చరించింది.
పహల్గావ్ లో మొత్తం 26 మంది అమాయకులను పాక్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. పర్యాటకుల మతం అడిగి మరీ.. హిందువులను మాత్రమే చంపేశారు. కొత్తగా పెళ్లయిన జంటలో కూడా వరుడిని మట్టుపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ అంటూ పేరు పెట్టి.. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను సర్వనాశనం చేసేలా భారత్ దాడులు నిర్వహించడం పట్ల దేశంలో సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories