ముంబాయి సినీ నటి కాదంబరి జత్వానీని వీలైనంత దారుణంగా పోలీసు కేసులో ఇరికించడమే వారి టార్గెట్. ఆమె ద్వారా తమకు కావాల్సిన రీతిలో సంతకాలు తీసుకోవడమే వారికి కావాల్సింది. అందుకోసం పోలీసు ఉన్నతాధికారులు రకరకాల తప్పుడు మార్గాలు తొక్కారు. జగన్ కళ్లలో ఆనందం చూడడానికి అన్నట్టుగా విచ్చలవిడిగా వ్యవహరించారు. తీరా పరిస్థితులు వికటించి, జగన్ ఓడిపోయిన తర్వాత.. వారికి గడ్డు రోజులు తప్పడం లేదు. పైగా కాదంబరి వచ్చిపోలీసులు అధికారుల మీదనే కేసు పెట్టిన తర్వాత.. వారు చేసిన పాపాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో వెలుగు చూస్తున్నది.
కాదంబరి జత్వానీని అరెస్టు చేసి విజయవాడకు తీసుకువచ్చిన తర్వాత.. జిందాల్ కేసుకు సంబంధించి ఆమె ఒత్తిడి చేశారనే సంగతి ఇప్పటికే బయటకు వచ్చింది. అలాగే పోలీసు కస్టడీలో ఉన్న రోజుల్లో ఆమెతో ఆమె వాడుతున్న ఐఫోన్ ఓపెన్ చేయించడానికి పలు ప్రయత్నాలు చేశారు. వారు ఎంత బెదిరించినా సరే.. ఆమె ఫోను ఓపెన్ చేయడానికి ఒప్పుకోలేదు. ఆమె ఐఫోన్ ఓపెన్ చేస్తే.. ఆమ చేస్తున్న ఫిర్యాదులకు సంబంధించి ఆమె ఫోనులో ఉండే ఆధారాలను ధ్వంసం చేసేయవచ్చు అనేది పోలీసుల కుట్ర అయి ఉండచ్చునని ఆమె తన భయాన్ని గతంలోనే వ్యక్తం చేశారు.
ఆమె ఒప్పుకోకపోయేసరికి పోలీసులు కొత్త ఎత్తుగడ వేశారు. విజయవాడలోని ఒక స్పా సెంటర్ పై దాడి చేశారు. ఒక ఈశాన్య రాష్ట్రానికి చెందిన మహిళను అరెస్టు చేశారు. ఆమెను స్పాసెంటర్లకు సరఫరా చేసే ఏజంటుగా ఢిల్లీకి చెందిన అమిత్ కుమార్ సింగ్ పేరును చేర్చారు. కేవలం అమిత్ కుమార్ మీద ఏదో ఒక తప్పుడు కేసు పెట్టడం కోసమే పోలీసులు స్పాసెంటర్ మీద దాడి అనే ఎపిసోడ్ డ్రామా నడిపించారనేది కొందరిలో ఒక అనుమానం. ఇదంతా ఎందుకంటే.. అమిత్ కుమార్ సింగ్.. కాదంబరి జత్వానీకి సన్నిహితుడు. అతనిని అరెస్టు చేసి, ఆమె ద్వారా కాదంబరి ఫోను తెరిపించవచ్చుననేది పోలీసుల కుట్ర. కానీ అది ఫలించలేదు. పోలీసులు ప్రత్యేకంగా ఢిల్లీకి విమానంలో వెళ్లినా అమిత్ కుమార్ దొరకలేదు. దాంతో కాదంబరి ఫోను ఓపెన్ చేయడం వారికి కుదర్లేదు. కానీ.. ఆమెను ఇరికించడానికి సరికొత్త తప్పుడు కేసులతో రకరకాల తప్పుడు పనులు పోలీసులు చేయడం మాత్రం ఇప్పుడు బయటకు వచ్చిది.