అర్హులకే దక్కాలి అందుకే ఆలస్యం

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతోంది. అయితే రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ పర్వం ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో వారి అరాచకత్వాన్ని, వేధింపులను, దౌర్జన్య కాండను భరిస్తూ, ఎదుర్కొంటూ బతికిన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు తమకు సముచితమైన ఫలితం దక్కాలని కోరుకుంటున్నారు. చట్టసభల ప్రతినిధులుగా అవకాశం దక్కేది అతి కొద్ది మందికి మాత్రమే గనుక- నామినేటెడ్ పదవుల్లో చోటు లభిస్తే చాలునని వారంతా ఆశలు పెంచుకుంటున్నారు. అయితే కొన్ని కీలకమైన నామినేటెడ్ పదవులు పంపకం ఇప్పటికే పూర్తయింది. చాలా పోస్టులు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. వాటిని హడావుడిగా భర్తీ చేసేసి కార్యకర్తలలో అసంతృప్తికి బీజం వేయడానికి అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరు. అర్హులను ఎంపిక చేయడంలో ఒక శాస్త్రీయమైన విధానానికి అంచెలవారి వడపోత పద్ధతికి ఆయన శ్రీకారం చుట్టుబోతున్నారు. పదవులు ఇవ్వడం అనేది ఒకింత ఆలస్యం కావచ్చు గాని అర్హులకు మాత్రమే దక్కాలి అనేది చంద్రబాబు నాయుడు విధానంగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతానికి మొత్తం 215 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు పదవులు కేటాయించాల్సి ఉన్నట్టు సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ పదవులకు ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపాలని ఆయన కోరారు.
అయితే పదవుల కేటాయింపునకు, ఎంపికకు సంబంధించి నిర్దిష్టమైన విధివిధానాల్ని ఆయన ప్రకటిస్తున్నారు. ఈ పదవులను ఆశిస్తున్న వారు.. పార్టీ క్యూబ్స్ విభాగాల్లో సభ్యుడిగా ఉండాలంటున్నారు. పార్టీ కోసం నాయకులు పడిన కష్టాన్ని మదింపు చేయడానికి ప్రత్యేక వ్యవస్థ ఉన్నదని.. త్యాగాలు చేసిన వారు ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదనేదే చంద్రబాబునాయుడు భావనగా ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇలా ఎవ్వరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో పగడ్బందీగా ఎంపిక జరగాలనుకుంటున్నందువల్లే.. కొంత జాప్యం అవుతోంది. జూన్ లోగా అన్ని పదవుల భర్తీ పూర్తి చేయబోతున్నట్టుగా చంద్రబాబు ప్రకటిస్తున్నారు. అప్పటికి ప్రభుత్వం ఏర్పడి ఒక ఏడాది గడిచినట్టు అవుతుంది. అయినాసరే.. కష్టపడిన వారికి న్యాయం జరుగుతుందనే ఉత్సాహంతో తెలుగుదేశం కార్యకర్తలున్నారు. అదే సమయంలో జనసేన, బిజెపి పార్టీల విషయంలో ఆ పార్టీ అధినేతలు ఏ పేర్లు ఇస్తే వారిని ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories