జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉండగా రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్లందరినీ తన అక్కచెల్లెమ్మలని అన్నాడు. రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకీ తాను మేనమామనని కూడా చెప్పుకున్నాడు. కానీ.. తన సొంత మేనల్లుడి పెళ్లికి వెళ్లడానికి కూడా ఆయన వద్ద సమయం లేదు. తన సొంత చెల్లెలికి కాసింత మేలు చేయడానికి కూడా ఆయన వద్ద మనసు లేదు. రాజకీయ పదవులను చెల్లెలు షర్మిల ఆశించిన నేపథ్యంలో.. ఆమెకు ఏ పదవీ ఇవ్వకుండా ప్రచార అవసరాలకు వాడుకుని వదిలేసి.. ఇంటర్వ్యూలలో మీడియా అడిగిన దానికి ‘ఒకతరంలో ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే రాజకీయ పదవి ఉండాలనేది’ తన సిద్ధాంతం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. పార్టీలో అనేక మందికి ఒక తరంలో ఒక కుటుంబంలోనే పదవులు కట్టబెట్టడానికి ఎగబడిన ఈ ముఖ్యమంత్రి.. చెల్లెలు విషయం వచ్చేసరికి మాత్రం తాను కనిపెట్టిన విలువలు, సిద్ధాంతాలు ప్రవచించారు.
జగన్ చెల్లెలు షర్మిల అన్నతో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టుకుని అక్కడ విఫలమై మళ్లీ తిరిగి ఏపీలో పీసీసీ చీఫ్ గా ఎంపీ పదవికి పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు జాతీయ మీడియా చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన వచ్చింది. షర్మిలకు ఎందుకు రాజకీయ పదవి ఇవ్వలేదు అని అడిగితే.. ఒక కుటుంబంలో ఒక తరంలో ఒక్కరే ఉండాలనేది తన సిద్ధాంతమని చెప్పారు. తన తండ్రి వైఎస్సార్, చిన్నాన్న వివేకానందరెడ్డి ఒకే తరంలో పదవులు వెలగబెట్టిన సంగతి మర్చిపోయారు.
అలాగని ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారా? అంటి అది కూడా లేదు. బొత్స సత్యానారాయణకు- భార్య ఝాన్సీకి టికెట్లు ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి- తమ్ముడు ద్వారక నాధరెడ్డికి టికెట్లు ఇచ్చారు. అంబటి రాంబాబుకు- తమ్ముడు మురళికి టికెట్లు ఇచ్చారు. కానీ తన సొంత చెల్లెలు విషయంలో సిద్ధాంతం ముసుగు వేసుకున్నారు. అందుకే ప్రజలు జగనన్న ‘ఒక తరంలో ఒక్కరికే’ సిద్ధాంతానికి ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు.
తాముగా నిర్మించుకున్న మాఫియా సామ్రాజ్యాధినేతలు పెద్దిరెడ్డి సోదరులు తప్ప అంబటి సోదరులు, బొత్స దంపతులు ఈ ఎన్నికల్లో మట్టికరచిపోయారు. జగన్ తన అవకాశవాద సిద్ధాంతాలు మానుకుని రుజుమార్గంలో రాజకీయాలు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.