అత్యుత్సాహంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ.. తన కారుకింద కార్యకర్తలను తొక్కించి బలి తీసుకోవడమూ, లేదా, ఇంకో సరికొత్త డ్రామా సృష్టించడానికి మామిడికాయల తరహాలో ఇంకేదైనా తెప్పించి రోడ్లమీద పోయించి.. వాటిమీదుగా ‘తొక్కుకుంటూ’ ప్రయాణం సాగించడమూ వంటి ఓవర్ యాక్షన్ లకు జగన్ పాల్పడకుండా.. నెల్లూరు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జైల్లో ఉన్నవాడిని పరామర్శించడానికి వచ్చే నాయకుడు, అంతవరకే పరిమితం కావాలి గానీ.. ఆర్భాటంగా ప్రదర్శనగా ఊరేగాలని చూస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.
ఈనెల 31 వ తేదీన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించబోతుండగా.. ఆయన కాన్వాయ్ మాత్రమే ఉండాలని, అదనంగా పదిమందికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు పేర్కొనడం జరిగింది. తన ప్రతి పర్యటనతోనూ వివాదాన్ని, సంచలనాన్ని సృష్టించాలని కలలు కంటూ ఉండే జగన్మోహన్ రెడ్డి ఈ దఫా అయినా పోలీసుల హితవాక్యాలు చెవిన వేసుకుంటారో లేదో చూడాలి.
జగన్ సర్కారులో మంత్రిగా చేసిన కాకాణి గోవర్దన్ రెడ్డి.. నెల్లూరు జిల్లాలో వందల కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ దందాలకు కేంద్రంబిందువుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టు అయిన తర్వాత.. జులై 3 వతేదీనే జగన్ వెళ్లి పరామర్శించాలని అనుకున్నారు. ఆయన కోరిన చోట హెలిపాడ్ కు అనుమతి రాకపోయేసరికి ఆయన అలిగారు. పోలీసులు ఇచ్చిన అనుమతులు కూడా కాదనుకుని బెంగుళూరు ప్యాలెస్ వెళ్లిపోయారు. ఇప్పుడు31న జైలు ములాఖత్ కు వెళ్లేలా షెడ్యూలు పెట్టుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ పర్యటనలో ఒక కార్యక్రమం అదనంగా వచ్చి చేరింది.
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని బూతులు తిట్టిన తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అభినందించడానికి జగన్ ఆయన ఇంటికి కూడా వెళ్లాలని డిసైడ్ అయ్యారు జగన్. ఈ కార్యక్రమానికి విచ్చలవిడిగా జనాలను తోలించడానికి అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. నిజానికి పోలీసు ఆంక్షలు జగన్ మేలుకోసమే అనే అభిప్రాయాలు ఒకవైపు వ్యక్తం అవుతున్నాయి. ఆయన సత్తెనపల్లి పర్యటనకు వెళితే.. ఒక వ్యక్తిని తన కారు చక్రాల కింద తొక్కించిన కేసులో నిందితుడు అయ్యారు. బంగారుపాళెం వెళితే.. హైప్ క్రియేట్ చేయడానికి నానా బీభత్సం చేసిన, మామిడికాయల్ని అయిదు ట్రాక్టర్లలోతెప్పించి రోడ్డుపై పోయించిన కేసుల్లోఆయన అనుచరులు ఇరుక్కున్నారు. ఎవ్వరూ ఏకేసులోనూ ఇరుక్కోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఈ ఆంక్షలు విధించారు.
నిజానికి ములాఖత్ కు రాదలచుకున్న వ్యక్తి అంతవరకే పరిమితం కావాలి. ఆ భేటీని కూడా తన రాజకీయ బలప్రదర్శన డ్రామాగా మార్చకూడదు. కానీ జగన్ కు అలాంటి విచక్షణ ఎన్నడూలేదు. ప్రతి సందర్భాన్ని కూడా బలప్రదర్శనకు వాడుకోవాలనేదే ఆయన కోరిక. అలాంటి జగన్.. నెల్లూరులో రెండు కార్యక్రమాలు పెట్టుకోవడం.. పోలీసులు కేవలం 10 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చిన వేళ ఎలా వ్యవహరిస్తారనేది కీలకంగా ఉంది. . పోలీసులు అనుమతులు ఇచ్చేప్పుడు మాత్రమే కాదు.. జగన్ పర్యటన రోజున కూడా కఠినంగా ఉండి.. ఆ ఆంక్షలను ఏ ఒక్కరూ అతిక్రమించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని.. ప్రజలు కోరుకుంటున్నారు.