ఏదో కంటితుడుపుగా అన్నట్టుగా తాను యాత్రలు, పరామర్శలు నిర్వహించదలచుకున్నప్పుడు పోలీసులను అనుమతి అడగడం, అనుమతులు ఇవ్వడంలో పోలీసులు విధించిన నిబంధనలను, ఆంక్షలను గురించి విచ్చలవిడిగా ఎద్దేవా చేస్తూ రాజకీయ ప్రచారానికి వాడుకోవడం.. ఆ తర్వాత పోలీసుల నిబంధనలను ఉల్లంఘించడమే తన మొదటి లక్ష్యంగా రెచ్చిపోయి.. తోలించిన కిరాయి జనాలతో అనుమతులు లేని రోడ్ షోలు, యాత్రలు, జాతరల్లా నిర్వహిచండం ఇవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయాయి. యాత్రంలో సమయంలో పోలీసులు ఏకొంచెం గట్టిగా వ్యవహరించినా.. నా ప్రాణాలకు రక్షణ లేదు.. నా పార్టీ కార్యకర్తలను కొట్టేస్తున్నారు.. చంపేస్తున్నారు అని గోలచేయడం కూడా జగన్ కు పరిపాటిగా మారింది. కానీ.. రెంటపాళ్ల, బంగారుపాళ్యం, పాపిరెడ్డి పల్లె, పొగాకు యార్డు ఎక్కడ పర్యటించినా సరే.. జగన్ అనుసరించే యాక్షన్ ప్లాన్ ఇదే. కానీ.. అన్ని చోట్ల ఒక లెక్క.. నెల్లూరులో ఒక లెక్క.. అని ఇప్పుడు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు ఇన్చార్జి ఎస్పీగా, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ వ్యవహరిస్తుండడమే అందుకు కారణం అని కూడా అంటున్నారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ చాలా దృఢంగా వ్యవహరించే అధికారిగా పేరుపడ్డారు. తన పరిధిలో నమోదు అయ్యే కేసుల విషయంలో ఎలాంటి శషబిషలకు పోకుండా, మొహమాటతం జంకు గొంకు లేకుండా అంతు తేల్చే అధికారిగా పేరుంది. అలాంటి ఎస్పీ దామోదర్ ఇప్పుడు నెల్లూరు జిల్లాకు కూడా ఇన్చార్జిగా ఉన్నారు. ఇప్పటికే ఆయన ప్రెస్ మీట్ పెట్టి.. జగన్ యాత్ర సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి నిర్దిష్టమైన సూచనలు చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తాము కార్యక్రమం కోసం ప్రత్యేకంగా జనాన్ని తరలించడం లేదని పార్టీ వారు తమకు మౌఖికంగా చెప్పినట్టు కూడా దామోదర్ వెల్లడించారు. కేవలం జగన్ జాగ్రత్త కోసం, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం నిబంధనలు విధిస్తున్నట్టుగానూ వెల్లడించారు. ఎవరు ఉల్లంఘించినా కేసులు నమోదు చేస్తామని, డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు.
తాను అధికారంలో ఉన్నంత కాలమూ.. ఏదైనా ఊర్లకు పర్యటనలకు వెళితే.. రోడ్లపక్కన దుకాణాలను కూడా మూయించేస్తూ.. బారికేడ్లు కట్టించి రోడ్ల మీద అసలు నరసంచారం లేకుండా చేసేసి ఊరేగిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం ఎక్కడకు వెళ్లినా.. చావా పెళ్లా అనేది సంబంధం లేకుండా జనంతో కరచాలనాలు చేయడానికి ఎగబడుతున్న సంగతి తెలిసిందే. అలాంటి క్రేజ్ కోసమే ఆయన ప్రతిచోటా నిబంధనలను అతిక్రమించి రోడ్ షోలు చేస్తున్నారని కూడా మనం గమనించవచ్చు. అయితే నెల్లూరులో అలాంటి ప్రయత్నాలు సాగవని.. జైలులో ములాఖత్ తర్వాత.. నేరుగా ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి కాన్వాయ్ వెళ్లేలాగా.. మధ్యలో రోడ్ షో లాంటిది జరగకుండా చూసేలాగా ఎస్పీ దామోదర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.