ఒక్కటొక్కటిగా చుట్టుకుంటున్న పాత పాపాలు!

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదని అనడానికి కూడా వీల్లేని సందర్భం ఇది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ విషయంలో దేవుడు కూడా వరమిచ్చాడు.. పూజారి కూడా కరుణించాడు! ఎటొచ్చీ ఆ వరాన్ని స్వీకరించడానికి ఆయనకే ధైర్యం చాలలేదు. ఈలోగా అధికారమదంతో కళ్లు మూసుకుపోయి ఉన్నప్పుడు చేసిన మరోపాపం కూడా తలకు చుట్టుకుంది. కటకటాల వెనుకనుంచి ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశమే లేకుండా పోతోంది.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై.. జగన్ ప్రభుత్వ కాలంలో జరిగిన దాడికి సంబంధించి కీలక నిందితుల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా ఒకరు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేష్, సజ్జల రామక్రిష్ణారెడ్డి తదితర నిందితులు అనేకమంది ఉన్నప్పటికీ.. పాపం.. నందిగం సురేష్ మాత్రమే అరెస్టయ్యారు. రెండుసార్లు బెయిలు రిజెక్టు అయిన తర్వాత.. తాజాగా ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చింది. సొంత పూచీకత్తు సమర్పించకపోవడంతో ఆయన జైలు నుంచి బయటకు మాత్రం రాలేదు.


ఆ వ్యవహారం అలా ఉండగానే.. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో తుళ్లూరు పోలీసులు నందిగం సురేష్ ను అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు 21వ తేదీ వరకు రిమాండు విధించింది.
ఇది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో చేసిన పాపానికి సంబంధించిన పర్యవసానమే. అప్పట్లో అంటే 2020లో వెలగపూడిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణల్లో మరియమ్మ అనే మహిళ మరణించింది. హత్యకేసు నమోదు చేసిన పోలీసులు, నందిగం సురేష్ పేరును కూడా కేసులో చేర్చారు.

అధికారంలో ఉన్నది వాళ్ల పార్టీనే కాబట్టి.. ఇన్నాళ్లుగా ఆ కేసు విచారణ కూడా ముందుకు సాగలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేసు బయటకు రావడంతో.. ఆయన అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో బెయిలు లభించిందని మురిసిపోయేలోగానే.. మరియమ్మ హత్య కేసులో అరెస్టు కావడం అనేది దురదృష్టకరం అని సురేష్ అనుచరులు  వాపోతున్నారు.  ఇదే దాడి కేసులో వైసీపీలోని పలువురు సీనియర్ నాయకులు.. ఇంకా అరెస్టు అయ్యే పరిస్థితి రాకుండా సేఫ్ గా బయటే ఉన్నప్పటికీ.. నందిగం సురేష్ మాత్రం అరెస్టు కావడం అనేది ఒక కుట్రగా పార్టీలోని కార్యకర్తలే ఆవేదన చెందుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories