వన్ అండ్ ఓన్లీ ‘100%’ హీరో పవన్ కల్యాణ్!

ఆయన పార్టీ పెట్టి పదేళ్లు అయింది. తొలిసారి ఎన్నికలు వచ్చినప్పుడు అసలు సమరాంగణంలోకి తన పార్టీని తీసుకురాలేదు. కూటమి పార్టీల్లో భాగస్వామిగా కష్టపడ్డారు. రెండోసారి ఎన్నికలు వచ్చినప్పుడు.. పార్టీని ఒంటరిగా బరిలోకి దించి భంగపడ్డారు. చిన్న పార్టీతో పొత్తు పెట్టుకుని 175 స్థానాల్లో పోటీచేస్తే కేవలం ఒక్కచోట పార్టీ గెలిచింది. ఆ గెలిచిన వంచించి పార్టీ ఫిరాయించాడు. పార్టీ శ్రేణులు మరీ డీలాపడ్డాయి. కానీ ఆయన మాత్రం మడమ తిప్పలేదు. పార్టీని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికే కట్టుబడ్డారు. ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేయడాన్నే అలవాటుగా మార్చుకున్నారు. మొత్తానికి మూడోసారి ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని.. పార్టీని పోటీచేయించారు. ఈసారి ఎన్నికలు ఆయనకు రాష్ట్రం కనీవినీ ఎరుగని రికార్డును కట్టబెట్టాయి. చరిత్రలో ఎవ్వరూ చేయనివధంగా వందశాతం సక్సెస్ సాధించారు. ఆ రకంగా వన్ అండ్ ఓన్లీ హీరో ఇన్ ఏపీ పాలిటిక్స్ అన్నట్టుగా పవన్ కల్యాణ్ నిలిచారు.

పవన్ కల్యాణ్ పార్టీ జనసేన 21 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీచేసింది.. మొత్తం 21 మందీ గెలిచారు. అలాగే 2 ఎంపీ స్థానాల్లో పోటీచేయగా ఇద్దరూ గెలిచారు. నూటికి నూరుశాతం విజయాలు నమోదు చేసిన పార్టీగా పవన్ కల్యాణ్ ఏపీ చరిత్రలో రికార్డు సృష్టించారు. చరిత్రలో ఎక్కడైనా పొత్తుల్లో ఒకటిరెండు స్థానాలు పుచ్చుకుని, ఆ రెండు చోట్ల గెలిచిన పార్టీలు ఉండవచ్చు. కానీ ఇంత పెద్దసంఖ్యలో సీట్లలో పోటీచేసి నెగ్గడం చిన్నవిషయం కాదు.
ఇలాంటి హండ్రెడ్ పర్సెంట్ విజయం పవన్ కు ఆషామాషీగా ఏం దక్కలేదు. అందుకు ఆయన చాలా కష్టపడ్డారు. తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధమైనప్పుడు.. పార్టీ శ్రేణులు చాలా పెద్ద ఆశలే వ్యక్తం చేశాయి. కానీ తొలుత పవన్ 30 సీట్లకు ఒప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ మాత్రం సీట్లు తీసుకున్నందుకే విమర్శలు వచ్చాయి. ఆయనను పలువురు ఎద్దేవాచేశారు. ఇంతలో కూటమిలోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చిన తర్వాత.. వారికి దక్కిన 10 సీట్లను పవన్ కల్యాణ్ తన వాటా నుంచే ఇవ్వాల్సి వచ్చింది. మొత్తానికి ఫైనల్ గా 21 స్థానాలు మాత్రమే దక్కాయి. చాలా మంది ఎగతాళి చేశారు. కానీ పవన్ ఎక్కడా రెచ్చిపోకుండా, అవమానం ఫీల్ కాకుండా ఉన్నారు. ఆయన తెలివితేటలు ఏంటంటే.. కచ్చితంగా తమ పార్టీకి బలం ఉన్న స్థానాలను మాత్రమే ఎంచుకున్నారు. వాటికోసం పట్టుబట్టి తీసుకున్నారు. ఆ ఫలితంగానే మొత్తం అన్ని స్థానాల్లోనూ విజయం సాధించారు. వన్ అండ్ ఓన్లీ హీరోగా గెలవగలిగారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories