నాచురల్ స్టార్ నాని, ఇటీవల హిట్ 3 సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలనాతో కలిసి ఆయన చేసిన ఈ థ్రిల్లర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో, సినిమా టీం ఇటీవల విజయోత్సవ వేడుకను నిర్వహించింది.
ఈ ఈవెంట్ లో నాని చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శైలేష్‌తో తన స్నేహం, వర్క్ జట్టు బలంగా కొనసాగుతుందంటూ నాని ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చాడు. ఆయన చెప్పిన ప్రకారం, మరోసారి శైలేష్‌తో కలిసి సినిమా చేయబోతున్నాడు. అయితే ఈసారి మాత్రం హిట్ సిరీస్ లా ఇంటెన్స్ సబ్జెక్ట్ కాకుండా, పూర్తి వినోదంతో నిండిన కథను తీసుకురానున్నామని నాని వెల్లడించాడు.
శైలేష్ చెప్పిన ఓ కామెడీ కాన్సెప్ట్ తనకు చాలా బాగా నచ్చిందని, ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమన్నా, సినిమా మాత్రం హిందంగా ఉంటుందని నాని ఆశాభావంగా చెప్పాడు. హిట్ 3 లాంటి ఇంటెన్స్ జానర్‌కి విరుద్ధంగా, శైలేష్ – నాని కాంబినేషన్ నుంచి ఈసారి పూర్తి ఫన్‌తో నిండిన సినిమా రానుండడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటికే హిట్ 3 విజయంతో నాని – శైలేష్ కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు కామెడీ బేస్డ్ సినిమా అనే విషయం బయటకు రావడంతో, ఈ జంట నుంచి వచ్చే తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుందో, దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పుడు రాబోతాయో అన్న ఆసక్తి అందరిలో ఉంది.