గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి దిగిన కేసులో అక్కడి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక నిందితుడు. ఈ కేసులో ఆయన ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. గతంలో రెగ్యులర్ బెయిలు కోసం దరఖాస్తు చేసుకోగా విజయవాడ కోర్టు తిరస్కరించింది. హైకోర్టులో రెగ్యులర్ బెయిలు కోసం కొత్తగా పిటిషన్ వేశారు. వాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును శుక్రవారం నాడు వెలువరించింది. ఈ కేసులో వల్లభనేని వంశీతోపాటు రిమాండులో ఉన్న ఇతర నిందితులు కైలా ఆదిలక్ష్మి, శివకుమార్, నీలం ప్రవీణ్ కుమార్, రూతమ్మ, మహమ్మద్ మౌలానా, జానీ లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. వంశీ ఉసిగొలిపితే దాడికి పాల్పడిన అనుచరులందరికీ బెయిలు దొరికింది. తెరవెనుక ఉండి వ్యవహారం నడిపించిన వల్లభనేని వంశీకి మాత్రం బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది. ఆయన మీద ఉన్న ఇతర కేసులు, వ్యవహార సరళి గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తులు బెయిలు పిటిషన్ ను తిరస్కరించారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై అనుచరులతో దాడి చేయించి, అక్కడ విధ్వంసం సృష్టించి ఫర్నిచర్ ను, కంప్యూటర్లను ధ్వంసం చేయించి, పార్క్ చేసి ఉన్న వాహనాలను కూడా తగులపెట్టించి నానా దౌర్జన్యం నడిపించిన కేసులో వల్లభనేని వంశీ నిందితుడు. ఆ కేసు విచారణలో ఒక కొలిక్కి రాకమునుపే ఆయన కేసు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అనే దళిత యువకుడిని కిడ్నాప్ చేసి నిర్బంధించారు. అతడిని బెదిరించి బలవంతంగా తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు. ఆ తర్వాత వీరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన వైనం వెలుగులోకి వచ్చింది. సాక్ష్యాధారాల సహా వంశీ బెదిరింపులు, కిడ్నాప్ వ్యవహారాలు అన్ని బయటపడ్డాయి. ఆయన ముందు అదే కేసులో అరెస్టు అయి రిమాండ్ లో ఉన్నారు. ఆ కేసులో సాక్షాధారాలన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తుండగా పార్టీ ఆఫీసు మీద దాడి కేసులో బెయిలు ఇచ్చినట్లయితే మరొకమారు వల్లభనేని వంశీ సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నిస్తారని సాక్షులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు నమోదు అయ్యేలా చేస్తారని పేర్కొన్న సిఐడి వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. అందుచేతనే ఆయన బెయిలు పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించింది.
ఈ దశలో వంశీకి బెయిలు ఇవ్వలేమని, ఒకవేళ పరిస్థితిలో మార్పు చోటు చేసుకుంటే.. విజయవాడ సెషన్స్ కోర్టును వంశీ ఆశ్రయించవచ్చునని హైకోర్టు సూచించింది. ఇది వంశీకి న్యాయపరంగా చాలా పెద్ద దెబ్బ అని అనుకోవాలి. సత్యవర్దన్ ను కిడ్నాప్ చేయించి.. అతనితో తప్పుడు వాంగ్మూలం ఇప్పిస్తే చాలు.. అసలు కేసు కూడా ఎగిరిపోతుందని వంశీ అనుకుని ఉంటారు. కానీ.. అలాంటి కుటిల ప్రయత్నం వలన.. ఆయనకు ఏ కేసులోనూ ఎప్పటికీ బెయిలు రాని పరిస్థితి ఎదురైంది. ఆయన బుద్ధి ఇలా సాక్ష్యాలను తారుమారు చేయడమే అన్నట్టుగా ఎస్టాబ్లిష్ అయింది.