ఊరి మీద అలిగి, వెనకటికి ఓ ప్రబుద్ధుడు, చెరువుకు స్నానానికి వెళ్లడం కూడా మానేశాడని సామెత! ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన శాసనసభ్యుల వ్యవహారం చూస్తే అచ్చం అలాగే కనిపిస్తోంది. శాసనసభకు హాజరుకాకుండా ఇళ్లలో కూర్చుని.. ఎంచక్కా.. లక్షలకు లక్షల రూపాయల ఎమ్మెల్యే వేతనాలు తీసుకుంటున్న వైసీపీ నాయకులు.. తమ బాధ్యతలు నిర్వర్తించడానికి సభకు రారు సరే.. కనీసం శాసనసభ్యులంతా సరదాగా గడపడానికి ఉద్దేశించిన క్రీడల పోటీలకు కూడా రారా?? అనే సందేహం ఇప్పుడు ప్రజలకు కలుగుతోంది.
ఏపీ అసెంబ్లీ సభ్యులకు క్రీడోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఎమ్మెల్యేలు అందరేూ కూడా.. గెలుపోటముల గురించిన ఆలోచన లేకుండా.. సరదాగా గడపడానికి.. ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా మెలగడానికి.. అందరి మధ్య స్నేహసంబంధాలు ఏర్పడడానికి ఇలాంటి క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజున.. స్పీకరు అయ్యన్నపాత్రుడు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. అలాగే పురుష ఎమ్మెల్యేలకు, మహిళా ఎమ్మెల్యేలకు మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్ పోటీలో మహిళా ఎమ్మెల్యేలే గెలిచారు. అలాగే డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణరాజు మాట్లాడుతూ.. తాను దానవీర శూరకర్ణలోని ఎన్టీఆర్ డైలాగుల్ని బట్టీ పెడుతున్నానని, స్కిట్ వేస్తానని ప్రకటించి అలరించారు.
ఇలా ఎమ్మెల్యేలందరూ.. ఈ క్రీడోత్సవాల సందర్భంగా.. తాము ఎమ్మెల్యేలం అని, తమకు పెద్దపెద్ద హోదాలు ఉన్నాయనే సంగతి మర్చిపోయి.. పసిపిల్లల్లాగా ఆడుకుంటున్నారు. నవ్వుతూ తుళ్లుతూ ఒకరితో ఒకరు కలిసిపోయి సరదాగా గడుపుతున్నారు. అయితే ఇలాంటి ఆనందకరమైన, స్నేహపూర్వక అనుభవాన్ని సొంతం చేసుకోవడానికి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మనసు అంగీకరిస్తున్నట్టు లేదు. శాసనసభ్యుల క్రీడోత్సవాలకు వైసీపీ సభ్యులు హాజరు కాలేదు.
శాసనసభకు హాజరు కావాలనే ప్రాథమిక బాధ్యతను వారు ఎటూ నిర్వర్తిండచం లేదు. కనీసం అందరితో సరదాగా గడిపే సందర్భాలను కూడా వాడుకోరా.. ఊరదందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టెది ఒకదారి అన్నట్టుగా.. అలా ఎడంగానే ఉంటారా? దీనివల్ల.. వారి మీద ప్రజల్లో మరింత చులకన భావం ఏర్పడదా? అని ప్రజలు అనుకుంటున్నారు.
అయినా.. ఇలాంటి క్రీడోత్సవాలు వంటివి.. ఎమ్మెల్యేల మధ్య పార్టీ రహితమైన స్నేహబంధాలు పెరగడానికి ఏర్పాటుచేస్తారని.. అసలు స్నేహానికి విలువ తెలియని, స్నేహంగా మెలగడం అంటే పాపంగా భావించే వ్యక్తులకు ఇలాంటి క్రీడోత్సవాలు ఇష్టం ఉండవేమోనని.. ప్రజలు నవ్వుకుంటున్నారు.